ఆమ్నెస్టీ డైరెక్టర్ ఆకార్ పటేల్ కు ఈడీ సమన్లు 

అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్-సీఈఓ ఆకార్‌ పటేల్‌, మరో ఇద్దరికి ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు మేరకు నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈ చర్య తీసుకుంది. జూన్ 27న హాజరుకావాలని వీరిని ఆదేశించింది.
ఇండియన్స్ ఫర్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాశ్ కుమార్, ఏఐఐపీఎల్ మాజీ సీఈఓ జీ అనంత పద్మనాభన్, ఆకార్ పటేల్‌లకు ఈ కేసులో స్పెషల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ ఫిర్యాదును స్పెషల్ కేసుగా నమోదు చేయాలని ఆదేశించింది. సీబీఐ కేసుల ప్రత్యేక జడ్జి సంతోష్ గజానన్ భట్ ఈ చర్యలు తీసుకున్నారు.
 
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టంను ఉల్లంఘించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి పొందకుండా బ్రిటన్‌లోని సంస్థల నుంచి రూ.36 కోట్లు స్వీకరించిందని ఈడీ ఆరోపించింది. ఈ సంస్థ వ్యాపార పద్ధతులను ఉపయోగించి ఈ నిధిని సేకరించిందని పేర్కొంది.
 
సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం విదేశీ విరాళాలు స్వీకరించడం కోసం 2011-12లో ఎఫ్ సి ఆర్ ఎ కింద ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తీసుకొన్న అనుమతిని భద్రతా ఏజెన్సీల నుండి వచ్చిన ప్రతికూల సమాచారం కారణంగా  ప్రభుత్వం తర్వాత రద్దు చేసింది
 
ఈడీ దర్యాప్తులో వాణిజ్యపరంగా అనుసరించే కాంట్రాక్టు సేవలు, అడ్వాన్స్ చెల్లింపులు, ఆటోమేటిక్ మార్గం ద్వారా ఎఫ్ డి ఐ లను స్వీకరించడం వంటి చర్యలకు పాల్పడినట్లు వెల్లడైనది.  హోమ్  మంత్రిత్వ శాఖ నుండి అనుమతి లేకుండా విదేశీ సంస్థల నుండి రూ 36 కోట్ల మేరకు స్వీకరించినట్లు వెల్లడైనది. 
 
2015 నుండి 2019 వరకు ఆకర్ పటేల్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఈ సంస్థ ఆర్ధిక విషయాలు, యాజమాన్యంకు నేతృత్వం వహించినట్లు ఈడీ పేర్కొన్నది.