రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం నిర్వహించదలపెట్టిన ‘మహిళా దర్బార్’కు అనూహ్య స్పందన లభించింది. దీని కోసం అపాయింట్‌మెంట్లు కోరాలంటూ రాజ్‌భవన్ చేసిన ప్రకటనకు ఏకంగా 400 మందికిపైగా స్పందించారు. గవర్నర్‌కు తమ గోడును వెళ్లబోసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఇందులో జంట నగరాల నుంచే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి బాధితులు ఉన్నారు.
అయితే జంట నగరాల బాధితులే చాలా ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం. వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొంటున్నవారు, ఇదివరకే అన్యాయానికి గురైనవారు, భద్రత కోరుకునే మహిళలు అపాయింట్‌మెంట్ కోసం అభ్యర్థించిన వారిలో ఉన్నారు.
బాధితుల నుంచి భారీ స్పందన లభిస్తుండడంతో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అపాయింట్‌మెంట్ల అభ్యర్థనలను స్వీకరిస్తామని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. అపాయింట్‌మెంట్ కోరే వారి సంఖ్య 500 దాటితే.. ‘మహిళా దర్బార్-2’ నిర్వహించే అవకాశం ఉందని ఆవర్గాలు పేర్కొన్నాయి.
జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్‌లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఘటనలు జరిగాయి. వీటిపై పోలీసులు సరిగా స్పందించట్లేదని, బాధితుల వైపు నిలవకుండా.. నిందితులను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి.
పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లిన కేసుల విషయంలోనే ఇలాంటి అన్యాయాలు చోటు చేసుకుంటుంటే.. ఇంకా పోలీసు స్టేషన్ల వరకు రాని కేసులు ఎన్ని ఉన్నాయో అని భావించిన గవర్నర్ తెరమాటున ఉన్న బాధితుల గోస కూడా వినాలని నిర్ణయించారు. శుక్రవారం(10న) మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు దర్బార్‌ను నిర్వహించాలని నిర్ణయించారు.
వాస్తవానికి తొలుత బాధితులందరితో గవర్నర్ మాట్లాడేలా కార్యక్రమాన్ని రూపొందించినప్పటికీ.. అనూహ్యంగా 400 దరఖాస్తులు రావడంతో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అందులో భాగంగా 12 గంటలకు బాధితులను ఉద్దేశించి గవర్నర్ తొలుత ప్రసంగిస్తారు. ఆ తర్వాత సీరియస్ కేసు బాధితులతో గవర్నర్ వ్యక్తిగతంగా మాట్లాడుతారు.
అనంతరం అందరితో కలిసిపోయి ర్యాండమ్‌గా ఒక్కో బాధితురాలితో మాట్లాడే అవకాశాలూ ఉన్నాయి. కార్యక్రమానికి ముందే బాధితులందరి నుంచి వారి సమస్యకు సంబంధించి రాత పూర్వక వివరాలు తీసుకుంటారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక ప్రొఫార్మా తయారు చేశారు. ఇందులో బాధితురాలికి ఎదురైన సమస్య, కోరుతున్న పరిష్కారం, నిందితుల వివరాలు, ఆర్థిక సాయానికి సంబంధించిన అభ్యర్థన తదితర వివరాలుంటాయి.
వాటి ఆధారంగా రాజ్‌భవన్ చర్యలు తీసుకుంటుంది. సమస్యలను ప్రభుత్వానికి నివేదించి, చర్యలు తీసుకోవాలని సూచించనుంది. అంతటితోనే ఆగకుండా.. ఫలానా కేసు విషయంలో ఏ చర్యలు తీసుకున్నారు, ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడి వరకు వచ్చిందంటూ తరచూ రిమైండర్లు పంపి, వివరాలు తీసుకోనుంది.
కాగా, రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్‌లను అరికట్టాలని కోరుతూ మహిళా కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌లో శుక్రవారం గవర్నర్ తమిళిసైని కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు.
More Stories
దావోస్ నుండి వట్టిచేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు
ఇన్‌కాయిస్‌కు సుభాష్ చంద్ర బోస్ పురస్కారం
20 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం?