బిజెపి నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అరెస్ట్ 

బిజెపి నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని గురువారం అర్ధరాత్రి  రాచకొండ పోలీసులు  ఘట్ కేసర్ టోల్ గేట్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. జూన్‌ 2వ తేదీన జిట్టా ఆధ్వర్యంలో బిజెపి  నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం ‘అమరుల యాదిలో.. ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’లో కెసిఆర్‌ను కించపరిచేలా ‘స్కిట్‌’ చేశారని టిఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. 
 
కాగా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తనను అరెస్టు చేయడమేంటని జిట్టా పోలీసులను ప్రశ్నించారు. అయితే ఆయన మాటలను పట్టించుకోని పోలీసులు బలవంతంగా ఆయనను అరెస్టు చేశారు. తెలంగాణ ఉద్యమకారులు ప్రజాస్వామ్య బద్దంగా సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కులేదా? అని పోలీసులను నిలదీశారు. అయితే జిట్టాను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లిందీ తెలియదు. 
అర్ధరాత్రి ఎలాంటి నోటీసు లేకుండా పోలీసులు తమ పార్టీ నేతను అరెస్టు చేయడంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దోపిడీ దొంగలమాదిరిగా తమ పార్టీ నేతను కిడ్నాప్‌ చేశారని ఆయన మండిపడ్డారు. వెంటనే జిట్టా ఆచూకీ తెలపాలని, ఆయనను విడుదల చేయాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. జిట్టాకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
జిట్టా బాలక్రిష్ణారెడ్డి అరెస్టును మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ తీవ్రంగా ఖండిస్తూ ఆయన  ఏమైనా హంతకుడా? తీవ్రవాదా? అర్ధరాత్రి అరెస్ట్ చేయమేంటి? అంటూ ప్రశ్నించారు.  తెలంగాణ ఉద్యమకారులకు సభలు, సమావేశాలు నిర్వహించే హక్కు కూడా లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రజాస్వామ్యబద్దంగా ప్రభుత్వ విధానాలు, కేసీఆర్ పనితీరును ప్రశ్నించడమే నేరమా? అని నిలదీశారు.
బాలక్రిష్ణారెడ్డి అరెస్ట్ ను  శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ తీవ్రంగా ఖండిస్తూ  తెలంగాణ కేసీఆర్ సొత్తేమీ కాదు… అందరం ఉద్యమం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని స్పష్టం చేశారు.  ఉద్యమ కాంక్షలు నెరవేరలేదనే భావనతోనే సదస్సు నిర్వహించారని తెలిపారు.
కేసీఆర్ పనితీరు, ప్రభుత్వ విధానాలపై నాటక రూపంలో ప్రదర్శన చేయడం నేరమెలా అవుతుంది? అంటూ విస్మయం వ్యక్తం చేశారు.  గతంలో తెలంగాణ ఆకాంక్షలు, ఆంధ్రా పాలకుల మోసాలపైనా కేసీఆర్ సమక్షంలోనే అనేక కళా ప్రదర్శనలు చేసిన సంగతి గుర్తు లేదా? అని ఎద్దేవా చేశారు.
 
ఆనాడు చప్పట్లు కొట్టి దగ్గరుండి… కళాప్రదర్శనలు, నాటకాలు ప్రోత్సహించిన కేసీఆర్… ఇప్పుడు కళాకారులపై ఉక్కుపాదం మోపుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం సరికాదని హెహితవు చెబుతూ  చట్టానికి లోబడి విధులు నిర్వహించాలని స్వామిగౌడ్ సూచించారు.