దాయాది దేశం పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఇండస్ నది సమీపంలో ఉన్న ఓ చరిత్రాత్మక ఆలయాన్ని పాకిస్తానీలు ధ్వంసం చేసిన ఘటన మరువకముందే మరో ఆలయం ధ్వంసమైంది. పాకిస్తాన్‌లో హిందూ దేవాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. కరాచీలోని సింధూ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది.
కరాచీలోని కోరాంగి ప్రాంతంలో ఉన్న శ్రీ మారి మాతా మందిరంలోని విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసి పరారయ్యారు. ఆరు నుంచి ఎనిమిది మంది దుండగులు బైక్స్పై వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు.ఈ ఆలయంలో హనుమాన్ విగ్రహంతో పాటు శివలింగం, మరికొన్ని దేవుళ్ల పటాలున్నాయి. బైక్‌లపై గుంపుగా ఆ ఆలయానికి వెళ్లిన కొందరు దుండగులు ఆ విగ్రహాలను, పటాలను ధ్వంసం చేశారు.
అంతేకాదు.. ఆలయానికి సమీపంలో ఉన్న హిందువుల ఇళ్లపై కూడా దాడి చేశారు. ఈ ఘటన బుధవారం పొద్దుపోయాక జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకూ ఎలాంటి అరెస్ట్‌లు జరగకపోవడం గమనార్హం. నిర్మాణంలో ఉన్న ఈ ఆలయంలో ఒక పూజారి కొన్ని రోజుల క్రితం విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారు. విగ్రహాలు దుండగుల దాడిలో పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
ఎవరు, ఎందుకు ఈ దాడులకు పాల్పడ్డారో తమకు తెలియదని స్థానికంగా ఉన్న హిందువులు చెప్పారు. ఈ ఘటనను కళ్లారా చూసిన ప్రధాన సాక్షి స్పందిస్తూ.. ఆరు నుంచి ఎనిమిది మంది వరకూ మోటార్‌సైకిల్స్‌పై వచ్చి ఆలయంపై దాడి చేశారని మీడియాకు చెప్పాడు.
ఆలయ ధ్వంసం ఘటనతో స్థానిక హిందువుల్లో భయాందోళనలు చెలరేగినట్లు ఓ పత్రిక తెలిపింది. ఇక, ఆలయ ధ్వంసం ఘటన తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఆలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్టు తెలిపారు.
పరారీలో ఉన్న నిందితులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ.. ఆధారాలను సేకరిస్తున్నామని, ఆ ప్రాంతంలో ఉన్న హిందువులకు భద్రత కల్పిస్తామని తెలిపారు. మరోవైపు.. పాకిస్తాన్‌లో ఆలయాలపై దాడి జరగడం ఇది తొలిసారి కాదు. ఇదివరకు ఎన్నో చారిత్రాత్మక ఆలయాలపై దాడులు జరిగాయి. గతేడాది అక్టోబర్‌లో కోట్రీ ప్రాంతంలోని ఓ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేశారు.
పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాలపై ఈ తరహా దాడులు తరచుగా జరుగుతుండటంతో అక్కడ నివసిస్తున్న మైనార్టీలైన హిందువులు ఆందోళన చెందుతున్నారు. ఈ మూక దాడుల్లో గతేడాది అక్టోబర్‌లో కూడా ఒక చారిత్రక దేవాలయం ధ్వంసమైంది. పాకిస్తాన్‌లో ఉన్న మానవ హక్కుల సంఘం కార్యకర్తలు మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లో మహిళలకు, మైనార్టీలకు, చిన్నారులకు, మీడియా ప్రతినిధులకు కనీస రక్షణ కరువైందని చెప్పారు. సింధ్ ప్రావిన్స్‌లో హిందూ, సిక్కు, క్రైస్తవ బాలికలపై బలవంతంపు మత మార్పిడులకు పాల్పడుతున్న ఘటనలు కూడా రోజురోజుకూ పెరిగిపోతుండటం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది.
More Stories
ఇస్రో మరో ఘనత.. స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం
సంచలన ఆరోపణలు చేసే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత
ఆర్మీ అమ్ములపొదిలోకి 100 రోబోటిక్ డాగ్స్