మహమ్మద్ పై వాఖ్యలపై భారత్ వైఖరికి ఇరాన్ బాసట!

ప్రవక్త మహమ్మద్‌పై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదం విషయమై భారత దేశం స్పందించిన తీరు పట్ల ఇరాన్ సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్డోల్లహియన్ భారత ప్రభుత్వ వైఖరి సంతృప్తికరంగా ఉందని తెలిపారు.
ఇలా ఉండగా, మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల గురించి ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్డొల్లాహియాన్ ప్రస్తావించలేదని భారత్ స్పష్టం చేసింది. భారత్ పర్యటనలో ఉన్న అబ్డొల్లాహియాన్ మన దేశ విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారులతో చర్చల సందర్భంగా ఈ విషయం ప్రస్తావించారని, భారత్ వైఖరి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని ఓ వార్తా సంస్థ అంతకుముందు వెల్లడించిన సంగతి తెలిసిందే.
 ఓ వార్తా సంస్థ గురువారం తెలిపిన వివరాల ప్రకారం, బీజేపీ మాజీ అధికార ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్  చేసిన వ్యాఖ్యలను హొస్సేన్ బుధవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వద్ద ప్రస్తావించారు. దీనికి దోవల్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందారు. ఈ విషయాన్ని ఇరానియన్ ఫారిన్ మినిస్ట్రీ కూడా ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. హొస్సేన్ ఈ అంశాన్ని దోవల్ వద్ద లేవనెత్తారని, దోవల్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా ఉందని తెలిపింది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ వార్తా కథనాలపై  మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ, ప్రవక్త మహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు భారత ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించబోవని తెలిపారు. ట్వీట్లు, వ్యాఖ్యలు భారత ప్రభుత్వ అభిప్రాయాలకు ప్రతిబింబం కాదని స్పష్టంగా చెప్తున్నామని పెక్రో న్నారు. తమ ప్రతినిధులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశామని చెప్పారు.
 కామెంట్లు, ట్వీట్లు చేసినవారిపై సంబంధిత వ్యవస్థలు చర్యలు తీసుకున్నాయని తెలిపారు. ఈ విషయంలో అదనంగా చెప్పవలసినదేమీ లేదని స్పేస్పష్టం చేశారు. తనకు తెలిసినంత వరకు విలేకర్లు ప్రస్తావించిన ఇరానియన్ ప్రకటనను తొలగించారని చెప్పారు. తనకు తెలిసినంత వరకు ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్డొల్లాహియాన్ మన దేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ వద్ద ప్రస్తావించలేదని తెలిపారు.
దివ్య మతాల పట్ల, ముఖ్యంగా ప్రవక్త మహమ్మద్ పట్ల భారతీయులు, భారత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న గౌరవాన్ని అమిర్ ప్రశంసించారు. దేశంలో వివిధ మతాలను పాటించేవారి మధ్య మతపరమైన సహనం, చారిత్రక సహజీవనం, స్నేహభావాలను ప్రశంసించారు. మతపరమైన పవిత్ర భావాల పట్ల ముస్లింలకుగల సున్నితత్వాన్ని శ్రద్ధగా దృష్టి సారించాలని కోరారు.
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ఓ టీవీ చర్చలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దేశ, విదేశాల్లో ముస్లింలకు ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే.
ఇదిలావుండగా, ఇరాన్ , భారత్  మధ్య పరస్పర ప్రయోజనకరమైన వివిధ అంశాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చలు జరిపారని ఇరానియన్ ఫారిన్ మినిస్ట్రీ ప్రకటనలో తెలిపారు. వ్యూహాత్మక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలపై చర్చించినట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉందని అమీర్ చెప్పినట్లు పేర్కొన్నారు.