జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ (సింగిల్ యూజ్ ప్లాస్టిక్) వస్తువులను నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. జులై 1 నుంచి ఈ నిషేధం అమలు లోకి రానున్నది. 
 
దీంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, ట్రేలు ఇకనుంచి కనుమరుగు కానున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో భారీ స్థాయిలో వినియోగించే పాల ఉత్పత్తులు, పండ్ల రసాల టెట్రా ప్యాకుల్లో వాడే స్ట్రాలు కూడా కనిపించకుండా పోనున్నాయి. 
 
వీటికి ప్రత్యామ్నాయంగా పేపర్‌వి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నా స్ట్రాల నిషేధాన్ని వాయిదా వేయాలని అమూల్ వంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. అమూల్, పెప్సీ, కోకాకోలా, పార్లే వంటి సంస్థలు ఏటా వందల కోట్ల సంఖ్యలో ఈ ప్లాస్టిక్ స్ట్రాలను వినియోగిస్తున్నాయి. 
 
ముఖ్యంగా రూ.5 నుంచి రూ.30 ప్యాకుల్లో లభించే పాలు, పండ్ల రసాల డబ్బాలకు ప్లాస్టిక్ స్ట్రాలనే అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటి నిషేధాన్ని వాయిదా వేయాలని కోరుతూ అమూల్‌తోపాటు పార్లే వంటి సంస్థలు ప్రభుత్వానికి లేఖ రాసినట్టు సమాచారం.
కాగా,  చిన్నపాటి ప్లాస్టిక్‌ స్ట్రాల నిషేధాన్ని వాయిదా వేయాలంటూ దేవంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్‌’ కేంద్రాన్ని కోరింది. ఈ చర్య రైతులపై, పాల వినియోగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది.790 మిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన జ్యూసెస్‌, డెయిరీ ఉత్పత్తులను విక్రయించే పారిశ్రామిక రంగం ఈ నిషేధాన్ని వెనక్కు తీసుకోవాలని ఒకలేఖలో విజ్ఞప్తి చేస్తోంది. ప్రతి ఏడాది చిన్న పాటి స్ట్రాలతో బిలియన్ల డెయిరీ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు తెలిపింది.
ఈ నిర్ణయంపై ప్రభత్వం తన వైఖరిని మార్చుకోవడానికి నిరాకరించడం, ప్రత్యామ్నాయ స్ట్రాలను వినియోగించాలని ఆదేశించడంతో అమూల్‌, పెప్సీ, కోకో-కోలా సహా గ్లోబల్‌ డ్రింక్స్‌ సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. పాల ఉత్పత్తుల వినియోగం పెంచేందుకు చిన్న స్ట్రాలు తోడ్పడుతున్నాయని 8బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన అమూల్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.ఎస్‌.సోధి పేర్కొన్నారు.
దీంతో మోడీ ప్రభుత్వం ప్రకటించిన సింగిల్‌ యూజ్‌ ప్లాస్లిక్‌ వినియోగంపై నిషేధాన్ని ఏడాది పాటు వాయిదా వేయాలని కోరారు. ఈ వాయిదా నిర్ణయం వంద మిలియన్ల డెయిరీ రైతులతో పాటు పాలు, పాల ఉత్పత్తులపై ఆధారపడిన సంస్థలకు పెద్ద ఉపశమనం కలిగించగలదని పేర్కొన్నారు.

ప్రత్యామ్నాయ పేపర్‌ స్ట్రాలను చైనా, ఇండోనేషియాలతో పాటు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి.  దీంతో వాటికోసం అదనంగా 250 శాతం ఖరీదు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, పేపర్‌ స్ట్రాలను ఇప్పటికే దిగుమతి చేసుకుంటున్నప్పటికీ రూ.10 ఉత్పత్తులపై మాత్రం భారం పడనున్నట్లు తయారీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రూ.5 రూ. 30 ల మధ్య ఉన్న ప్యాకెట్లదే దేశంలో అతిపెద్ద మార్కెట్‌ అని, ప్రతి ఏడాది ఆరు బిలియన్ల ప్యాక్‌లు అమ్ముడవుతున్నాయని ఆయాసంస్థలు పేర్కొంటున్నాయి.  అయితే ఈ లేఖపై ప్రధాని కార్యాలయం స్పందించలేదు.