యుపిఐ వేదికకు క్రెడిట్ కార్డుల అనుసంధానం 

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌పేస్ (యుపిఇ) వేదికతో క్రెడిట్ కార్డులను అనుసంధానం చేయడానికి అనుమతించబోతున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ప్రస్తుతం డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లుగానే, భవిష్యత్తులో క్రెడిట్ కార్డులతో కూడా లావాదేవీలను జరపడానికి అవకాశం కలుగుతుంది.
యూపీఐ ప్లాట్‌ఫారంతో క్రెడిట్ కార్డుల అనుసంధానం గురించి మాట్లాడుతూ, ప్రారంభంలో రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ ప్లాట్‌ఫారంతో అనుసంధానిస్తామని పేర్కొన్నారు. దీనివల్ల వినియోగదారులకు అదనపు సౌకర్యం లభిస్తుందని తెలిపారు. డిజిటల్ పేమెంట్స్ పరిధి పెరుగుతుందని చెప్పారు.
యూపీఐ భారతదేశంలో అత్యంత సమ్మిళిత చెల్లింపుల విధానంగా మారిందని చెప్పారు. 26 కోట్ల మంది యూనిక్ యూజర్లు, 5 కోట్ల మంది మర్చంట్స్ ఈ వేదికపై ఉన్నారని తెలిపారు. యూపీఐ ద్వారా 2022 మే నెలలో దాదాపు 594 కోట్ల లావాదేవీలు జరిగాయని, వీటి విలువ రూ.10.4 లక్షల కోట్లు అని చెప్పారు.
ఇక యూపీఐ ప్లాట్‌ఫారంతో క్రెడిట్ కార్డులను అనుసంధానం చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.  ప్రస్తుతం యూజర్ల డెబిట్ కార్డుల ద్వారా పొదుపు/కరెంట్ ఖాతాలతో లావాదేవీలకు యూపీఐ అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.