వైసీపీ పోవాలి… బీజేపీ రావాలి… నడ్డా పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో ‘వైసీపీ పోవాలి… బీజేపీ రావాలి’ అని తెలుగులో నినాదం ఇస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేశారు. రాజమహేంద్రవరంలో  మంగళవారం సాయంత్రం జరిగిన `గోదావరి గర్జన’లో ఆ మేరకు  సభికులతో, వేదిక మీద ఉన్న వారితో కూడా ఆయన నినాదాలు ఇప్పించారు. 

 రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని ప్ర జలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ‘డబుల్‌ ఇంజన్‌’ ప్రభుత్వం కావాలని ఆశిస్తున్నారని చెప్పారు. ‘‘ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి. ప్రభు త్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాలను ప్రజల్లో తిరగ నివ్వడంలేదు. ప్రార్థనా మందిరాలపై దాడులు చేస్తున్నారు” అంటూ జగన్ పాలనపై ధ్వజమెత్తారు. 

ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని చెబుతూ ప్రతీకార చర్యలతో పెట్టుబడులు రావని నడ్డా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ‘నూతన విద్యా విధానం’లో మాతృ భాషల ప్రాధాన్యం పెరుగుతుండగా… ఇక్కడ మాత్రం తెలుగుకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 

 ‘‘జగన్‌ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది. దీనివల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారు. గ్రామ పంచాయతీ ఖాతాల్లో వేసిన నిధులు కూడా మళ్లించారు’’ అని నడ్డా మండిపడ్డారు. ‘‘ఏపీకి కేంద్రం నుంచి భారీగా నిధులు ఇచ్చాం. కానీ… వాటిని జగన్‌ ప్రభుత్వం పక్కదారి పట్టించింది. జగన్‌ అవినీతి పరాకాష్ఠకు చేరింది’’ అని నడ్డా ధ్వజమెత్తారు. 

2014 తర్వాత దేశంలో తీవ్రవాదం అంతమైందని చెబుతూ మోదీ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేసిందని నడ్డా తెలిపారు. ‘‘రూ.35 వేల కోట్ల మందికి ముద్రా రుణాలు ఇచ్చాం. పేదరికం 22 శాతం నుంచి 10 శాతానికి తగ్గింది. 2014లో మన తలసరి ఆదాయం 70 వేలు ఉండేది. అది ఇప్పుడు లక్షా 50 వేలకు పెరిగింది” అని వెల్లడించారు. 

దేశవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు 21 వేలు ఉండేవి. అవి 4.53 లక్షలకు పెరిగాయి. అక్షరాస్యత శాతం 65 నుంచి 75 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా  మెడికల్‌ కాలేజీలు 5శాతం పెరిగాయి.  మోదీ 15 ఎయిమ్స్‌ కాలేజీలు ఇచ్చారు. ఏపీలోని మంగళగిరిలో కూడా అత్యాధునిక ఎయిమ్స్‌ అందుబాటులోకి వచ్చిందని నడ్డా వివరించారు. 

ఆయుష్మాన్‌ భారత్‌తో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.భారత​ నుంచి 500 మిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరుగుతున్నాయి.  రెండో అతిపెద్ద రిటైల్‌ చైన్‌గా భారత్‌ మారింది. దేశంలో 2.5 కోట్ల గ్రామాలకు ఇంటర్నెట్‌ సేవలు. భారత్‌ అనేక రంగాల్లో ప్రగతి పథంలో వెళ్తోంది’ అని తెలిపారు.

దేశ జీడీపీ రూ.112 లక్షల కోట్ల నుంచి రూ.230 లక్షల కోట్లకు పెరిగిందని చెబుతూ భారత ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్లకు చేరుకున్నా ప్రధాని మోదీకి సంతృప్తి లేదని, దీనిని 5 ట్రిలియన్లకు చేర్చాలనే లక్ష్యంతో ఉన్నారని గుర్తు చేసారు.  ప్రధాని మోదీ వల్లే ఇవాళ సభలో మాస్కు కూడా లేకుండా జనం పక్కపక్కన కూర్చోగలిగారని పేర్కొంటూ కరోనా కట్టడికి 200 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ ఇచ్చామని గుర్తు చేశారు.

నడ్డా హిందీలో చేసి ప్రసంగాన్ని ఎమ్మెల్సీ పివిఎన్  మాధవ్‌ తెలుగులోకి అనువదించి వినిపించారు.  ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు,  సినీ నటి జయప్రద, కేంద్ర మాజీ మంత్రులు దగ్గుబాటి పురందేశ్వరి, సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.