రఘునందన్ రావుపై పోలీస్ కేసు… భగ్గుమంటున్న బిజెపి నేతలు 

జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక నిందితులను కాపాడటం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అసలైన నిందితులకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలు బయటపెట్టి, రాజకీయ పలుకుబడి గలవారి పిల్లలను కేసులో పోలీసులు చూపక తప్పని పరిస్థితులు కల్పించిన బిజెపి ఎంఎల్ ఎన్ రఘునందన్ రావు పై పోలీసులు కేసు నమోదు చేసి, ఆయనకు నోటీసులు జారీ చేయడం పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

నేరస్థులను వదిలివేస్తూ, న్యాయం కోసం పోరాడే వారిపై  కేసులు పెడతారా అంటూ మండిపడుతున్నారు.  తెరాస, ఏంఐఎం పార్టీకు బీ టీమ్ గా కాంగ్రెస్ పార్టీ వ్యవహారిస్తున్నట్లు ధ్వజమెత్తారు.

జూబిలీ హిల్స్ లో మైనర్ బాలికపై హత్యాచారం చేసిన తెరాస, ఎంఐఎం నాయకులకు సంబంధించిన వారిని కేసులో నుంచి తప్పించే ప్రయత్నం చేయడంతో, అసలు నిజాలను సాక్షాలతో పాటు వెలుగులోకి తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసులు పెట్టడం సిగ్గుమాలిన చర్యని బిజెపి జాతీయ  ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి  డీకే అరుణ మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళల పై అత్యాచారాలు జరుగుతుంటే వాటిని నియంత్రించాల్సిన పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని ఆమె  దుయ్యబట్టారు.  ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిందితులకు సంబంధించిన వారిపై పోరాడకుండా, బీజేపీ కార్యాలయం, ఎమ్మెల్యే రఘునందన్ పై విమర్శలు చేయడం దేనికి సంకేతమని అరుణ ప్రశ్నించారు.  ఇకనైనా పోలీసులు పక్షపాత ధోరణి మాని, నిందితులకు కొమ్ముకాయకుండా, బాధితుల పక్షాన నిలిచి వారికి న్యాయం చేయాలని, నగరంలో శాంతి భద్రతల పై శ్రద్ధ వహించాలని ఆమె హితవు చెప్పారు.
 
ప్రశ్నించే గొంతుకలను నొక్కి వేసేలా కేసులు పెట్టడం టీఆర్ఎస్ అరాచకాలకు పరాకాష్ట.  బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ ధ్వజమెత్తారు.  మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో తప్పు చేసిన నేరస్తులను వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేపీ నాయకుల, కార్యకర్తలతోపాటు ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు నమోదు చేయడం గర్హనీయం అని స్పష్టం చేశారు.
 
టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికార పార్టీ బెదిరింపులు, పోలీసుల లాఠీఛార్జీలు, కేసులకు భయపడే వెనుకంజ వేసే ప్రసక్తే లేదని అంటూ దోషులను శిక్షించే వరకు బిజెపి ఉద్యమిస్తూనే ఉంటుందని రాజాసింగ్ స్పష్టం చేశారు. 
న్యాయం కోసం పోరాడుతోన్న ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు పెట్టడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని, దోషులను శిక్షించే వరకు బీజేపీ ఉద్యమిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.  
 
బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసు పెట్టేందుకు చూపుతున్న శ్రద్ధ దోషులను అరెస్ట్ చేయడంపట్ల ఉంటే బాధితులకు న్యాయం జరిగేదని సంజయ్ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే  ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. 

పోలీసులపై మ‌హిళ క‌మిష‌న్ సీరియ‌స్‌

హైదరాబాద్‌లోని అమ్నేషియా పబ్ నుంచి మైనర్ బాలికను కారులో తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన‌ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ కేసు విచారణకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్ తెలంగాణ పోలీసుశాఖకు నోటీసులు జారీచేసింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరింది.

ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసే వీడియోలను ఆన్‌లైన్ నుంచి తొలగించాలని కోరారు. అట్లాంటి వీడియోలను పోస్టుల చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళ కమిషన్ డీజీపీని కోరింది.

మరోవైపు జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్ నుంచి పోలీసు శాఖకు నోటీసులు అందాయి. ఇప్పటికే ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

కాగా,   జూబ్లీహిల్స్‌లో బాలిక సామూహిక అత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ సరిగా స్పందించడం లేదని, బాధిత బాలికకు పూర్తిన్యాయం జరిగేదాకా, నిందితులను అరెస్ట్‌ చేసి, దోషులకు శిక్షపడేదాకా ఆందోళనలు, ధర్నాలు, ఇతర రూపాల్లో ముందుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. అలాగే బీజేపీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో దీనిపై బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది.