పొత్తులపై పెదవి విప్పవద్దు… ఎన్నికల సమయంలోనే .. నడ్డా 

రాజకీయ పొత్తుల గురించి నేతలెవరూ మాట్లాడొద్దని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆంధ్ర ప్రదేశ్ లోని పార్టీ  నేతలను ఆదేశించారు. పొత్తులపై ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ముందుగా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. బీజేపీ బలంగా  ఎదిగేందుకు ఇదే సరైన సమయమని నడ్డా వివరించారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం విజయవాడకు వచ్చిన నడ్డా రాత్రి నగరంలో రాష్ట్ర పార్టీ కోర్‌ కమిటీ నేతలతో భేటీ అయ్యారు. పొత్తుల గురించి ఇప్పుడు ఏ మాత్రం పట్టించుకోవద్దని ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలిసింది.  రాష్ట్రంలో ఉన్న సహచర పార్టీలు పొత్తులపై ఎలాంటి అంశాలను చర్చకు తీసుకు వచ్చినప్పటికీ మన ప్రతి ఆలోచన, కార్యక్రమం మాత్రం స్వయంకృషితో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేలా ఉండాలని నడ్డా సూచించారు.

బీజేపీ తమతో కలిసి పోటీచేస్తుందని కొన్ని ప్రత్యర్థి పార్టీల మైండ్‌ గేమ్‌ గురించి ఆలోచించవద్దని పరోక్షంగా టిడిపి గురించి ప్రస్తావిస్తూ తేల్చి చెప్పారు.  ఈ సందర్భంగా బీజేపీ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడి సీఎం అభ్యర్థి అని ప్రకటించవచ్చా?’ అని నడ్డాను ప్రశ్నించారు. దీనికి ఆయన.. బీజేపీ షరతులకు ఎప్పుడూ ఒప్పుకోదని, ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పినట్టు సమాచారం. అదేసమయంలో అధికార పార్టీ వైసీపీ ట్రాప్‌లో పడొద్దని బీజేపీ నేతలను నడ్డా హెచ్చరించారు.

అంతకుముందు, నడ్డా బీజేపీ శక్తి కేంద్ర ఇన్‌చార్జిల రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొంటూ రాష్ట్రంలో పార్టీ పురోగతి నాయకులు, కార్యకర్తలు చేతుల్లోనే ఉందని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని  పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి అందించిన తోడ్పాటుపై రాష్ట్ర బీజేపీ రూపొందించిన పుస్తకాన్ని నడ్డా ఆవిష్కరించారు. అనంతరం  నాలుగైదు పోలింగ్‌ బూత్‌లను కలిపి ఒకటిగా పేర్కొనే శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు పేర్లు మార్చి ఏపీలోని జగన్‌ ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటోందని, ఆయా పథకాలకు తమ స్టిక్కర్లు వేసుకుంటోందని నడ్డా విమర్శించారు. 

‘‘రైతులకు మోదీ ప్రభుత్వం అందిస్తున్న పీఎం-కిసాన్‌ పథకాన్ని సీఎం జగన్‌  ‘రైతు భరోసా’గా ప్రచారం చేసుకుంటున్నారు. పేదలకు దేశంలో ఎక్కడైనా రూ.5 లక్షల ఉచిత వైద్యం అందించే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ‘ఆరోగ్య శ్రీ’గా మార్చుకుని ప్రచారం చేస్తున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద పేదలకు పక్కా గృహాలు మంజూరు చేస్తుంటే వాటిని ‘జగనన్న కాలనీ’లుగా పేరు పెట్టుకున్నారు” అని గుర్తు చేశారు. 

ఇవన్నీ మోదీ ప్రభుత్వ పథకాలు. ఈ విషయాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివరించమని  పార్టీ శ్రేణులకు నడ్డా పిలుపునిచ్చారు. ఆరోగ్య శ్రీ వైద్యం రాష్ట్రం వరకే పరిమితమని, ఆయుష్మాన్‌ భారత్‌ పొరుగు రాష్ట్రాల్లోనూ వర్తిస్తుందన్నారు. కుటుంబ పార్టీలతో జమ్ము కశ్మీర్‌ నుంచి ఏపీ వరకు బీజేపీ పోరాడుతోందని చెప్పారు.

కాగా తెలుగు  రాష్ట్రాల్లో వైసీపీ, టీడీపీ, టీఆర్‌ఎ్‌సలను కుటుంబ పార్టీలుగా పేర్కొన్న నడ్డా టీఆర్‌ఎ్‌సలో కేసీఆర్‌ నుంచి ఆయన మనవడి వరకూ ప్రస్తావించారు. దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అయితే అన్నా చెల్లెలు పార్టీ కాంగ్రెస్‌ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిపైనా బీజేపీ జెండా ఎగరాలని, మోదీ ఎనిమిదేళ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ ఇచ్చే రూట్‌ మ్యాప్‌ ప్రకారం కార్యకర్తలు, నాయకులు ప్రజలను కలవాలని నడ్డా సూచించారు.

సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు ఇతర నేతలు జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్, పురంధరేశ్వరి, సునీల్‌ దియోధర్, సత్యకుమార్, కన్నా లక్ష్మీనారాయణ, సీఎం రమేష్, జీవీఎల్‌ నరసింహారావు, టీజీ వెంకటేష్, పీవీఎన్‌ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.