గ్యాంగ్ రేప్ లో కీలక ఆధారాలు వెల్లడించిన బీజేపీ ఎమ్యెల్యేపై కేసు నమోదు!

కలకలం సృష్టించిన జూబ్లిహిల్స్‌ అత్యాచార ఘటన కేసులో  కీలక సాక్ష్యాధారాలను కప్పిపుచ్చి, రాజకీయంగా పలుకుబడి గలవారిని తప్పించేందుకు విశ్వ ప్రయత్నం చేసిన పోలీసులు చివరకు బిజెపి ఎమ్మెల్యే ఎన్ రఘునందన్ రావు కీలక సాక్ష్యాధారాలైన ఫోటోలు, వీడియోలను బయట పెట్టడంతో కొన్ని చర్యలు చేపట్టక తప్పలేదు. ముఖ్యంగా ఎంఐఎం ఎమ్యెల్యే కొడుకుకు ఈ కేసులో అసలు సంబంధం లేదని స్వయంగా ఎసిపి ప్రకటించారు. 

అయితే రఘునందన్ రావు బలమైన సాక్ష్యాలను బయట పెట్టడంతో ఇప్పుడు ఎమ్యెల్యే కొడుకును కూడా నిందితుడిగా చేర్చక తప్పడం లేదు. అయినా కీలక నిందితులను పట్టుకోవడంలో మీనమేషాలు లెక్కపెడుతూ, వారు నగరం నుండి వెళ్లిపోయేందుకు అవకాశం కల్పించిన యంత్రాంగం ఇప్పుడు కీలక సాక్ష్యాధారాలు బయటపెట్టిన రఘునందన్ రావుపై ఇప్పుడు కేసు నమోదు చేశారు. 

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో ఫోటోలు, వీడియోలు బహిర్గతం చేయడంపై అబిడ్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 228(a) సెక్షన్‌ కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకోవాలన్నా, ఆయనపై కేసు నమోదు చేయాలన్నా అసెంబ్లి స్పీకర్‌ అనుమతి తీసుకోవలసి ఉంటుంది.

కాగా,  స్వయంగా న్యాయవాది అయిన రఘునందన్ రావు ఆ ఫోటోలలో ఆ బాలిక ముఖం, ఇతర గుర్తులు  కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తం కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టం కావడంతో పాక్షికంగానే బయటపెట్టారు. ఆయన ఈ ఫోటోలను బయట పెట్టని పక్షంలో కీలక నిందితులపై పొలిసు దర్యాప్తు దృష్టి సారించి ఉండెడిది కాదు. 

కాగా, మరోసారి అత్యాచారానికి గురైన మైనర్‌ బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. షీ టీమ్స్‌ పోలీసుల సమక్షంలో బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన ఫోటోలను బాలికకు చూపించి ఇందులో ఉన్న వారి వివరాలను సేకరించినట్టు సమాచారం. కొంత మందిని గుర్తించి తనపై లైంగిక దాడికి పాల్పడిన వారి వివరాలను ఆ బాలిక తన వాంగ్మూలంలో వివరించినట్లు తెలుస్తోంది. 

అమ్నీషియా పబ్‌ నుంచి బెంజి కారులో తీసుకువెళ్లిన క్షణం నుంచి తనపై కారులో ఉన్న నలుగురు అసభ్యంగా ప్రవర్తించారని, అప్పటికే కారులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్లు ఆమె చెప్పినట్లు సమాచారం. 

దీంతో ఎమ్మెల్యే కుమారుడిని అత్యాచారం కేసులో అరవ నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చేందుకు సిద్ధమైన పోలీసులు న్యాయపరమైన సలహా తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే అత్యాచారానికి గురైన బాలిక వాంగ్మూలాన్ని జువైనల్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా సంచలనం సృష్టించిన జూబ్లిహిల్స్‌ సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేసిన పాతబస్తీకి చెందిన సుభాన్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. మరో రెండు యూట్యూబ్‌ ఛానళ్లకు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించిన పోలీసులు ఒకటి, రెండు రోజుల్లో మరో రెండు, మూడు అరెస్టులు ఉండవచ్చని భావిస్తున్నారు. పకడ్బందీగా కేసును దర్యాప్తు చేసేందుకు పోలీసులు సాంకేతికపరమైన ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఫోన్‌ సిడీఆర్‌, సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించిన బాలిక చెవి రింగులు, చెప్పులు, వెంట్రుకలు, నిందితుల వీర్యం తదితర అంశాలపై వచ్చే నివేదిక ఆధారంగా ఈ కేసు కీలకంగా మారనున్నదని చెప్పారు. కాగా ఈ కేసులో జైలుకు పంపించిన ఐదుగురు మేజర్‌, మైనర్‌ నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు జూబ్లిdహిల్స్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు.