అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకంగా భారత బ్యాంకులు

అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థల్లో భారత బ్యాంకులు, కరెన్సీని భాగం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆర్థిక సంస్థలు మెరుగైన ఆర్థిక, కార్పొరేట్ పాలనా పద్ధతులను అనుసరించాలని ఆయన సూచించారు. 

75 ఏళ్ల స్వాతంత్య్ర వేడులను పురస్కరించుకుని నిర్వహిస్తోన్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రతిష్ఠాత్మక వారోత్సవాల ప్రారంభ సభలో ప్రధాని మాట్లాడారు.  కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇప్పటికే భారత్ అనేక ఆర్థిక పరిష్కార వేడుకలను ఆవిష్కరించిందని, వాటి వినియోగాన్ని పెంచడం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని సూచించారు. 

అలాగే వాటన్నిటినీ విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచం ఇప్పుడు ఒక పెద్ద వినియోగ మార్కెట్‌గానే కాకుండా అనేక సమస్యలకు పరిష్కార వేదికగా చూస్తోందని మోదీ వ్యాఖ్యానించారు.

ప్రధాని నరేంద్ర మోదీ  ఈ వేదికపై సోమవారం కొత్త నాణేల శ్రేణిని ఆవిష్కరించారు. అంధులు కూడా సులభంగా గుర్తించేలా వీటిని రూపొందించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లోగోను రూ.1, రూ.2, రూ. 5, రూ.10,రూ.20, మారకపు విలువ కలిగిన కొత్త నాణేలపై ముద్రించారు. 

ఇవి కేవలం స్మారక నాణేలు మాత్రమే కాదని, త్వరలో చెలామణి లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ కొత్త నాణేలు దేశాభివృద్ధి కోసం పనిచేసేలా ప్రజల్లో స్ఫూర్తి నింపుతాయని మోదీ తెలిపారు.  12 ప్రభుత్వ పథకాలతో అనుసంధానించిన జన సమ్మర్ధ్ పోర్టల్‌ను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రారంభించారు. ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా పాల్గొన్నారు. 

భారతదేశం కూడా గత ఎనిమిదేళ్లలో వివిధ కోణాల్లో పని చేసిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఈ కాలంలో దేశంలో పెరిగిన ప్రజా భాగస్వామ్యమే దేశాభివృద్ధికి ఊతమిచ్చి దేశంలోని పేద పౌరులకు సాధికారతను కల్పించిందని చెప్పారు. స్వచ్ఛ భారత్ అభియాన్ పేదలు గౌరవంగా జీవించే అవకాశాన్ని కల్పించిందని ప్రధాని వ్యాఖ్యానించారు. 

పక్కా గృహాలు, విద్యుత్, గ్యాస్, నీరు, ఉచిత చికిత్స వంటి సౌకర్యాలు పేదల గౌరవాన్ని పెంచి సౌకర్యాలను మెరుగుపరిచాయని తెలిపారు. కరోనా కాలంలో ఉచిత రేషన్ పథకం 80 కోట్ల మందికి పైగా దేశ ప్రజలను ఆకలి భయం నుండి విముక్తి చేసిందని గుర్తు చేశారు. లేమి అనే మనస్తత్వం నుండి బయటపడి, పెద్దగా కలలు కనడానికి పౌరులలో కొత్త విశ్వాసాన్ని మనం చూస్తున్నాం అని ప్రధాని పేర్కొన్నారు.

గతంలో ప్రభుత్వ-కేంద్రీకృత పాలన వల్ల దేశం తీవ్ర భారాన్ని మోపిందని ప్రధాని చెప్పారు. కానీ నేడు 21వ శతాబ్దపు భారతదేశం ప్రజా కేంద్రీకృత పాలనా విధానంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.  ముందుగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని మోదీ సూచించారు. 

ఇప్పుడు ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్లడం, వివిధ మంత్రిత్వ శాఖలు, వెబ్‌సైట్‌ల రౌండ్‌లు చేసే రిగమారోల్ నుండి వారిని విముక్తి చేయడంపై దృష్టి సారిస్తోందని వివరించారు. క్రెడిట్ లింక్డ్ ప్రభుత్వ పథకాల కోసం నేషనల్ పోర్టల్ ప్రారంభం – జన్ సమర్థ్ పోర్టల్ ఈ దిశలో ఒక ప్రధాన అడుగు అని ప్రధాని తెలిపారు.

ఈ పోర్టల్ విద్యార్థులు, రైతులు, వ్యాపారవేత్తలు, ఎంఎస్ఎంఇ  పారిశ్రామికవేత్తల జీవితాలను మెరుగుపరుస్తుందని, వారి కలలను సాకారం చేసుకోవడంలో వారికి సహాయపడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.