అనిల్ అంబానీపై నల్లధనం చట్టం ప్రయోగం 

అత్యంత సంపన్నుడి హోదా నుంచి ప్రస్తుతం దివాళా స్థాయికి దిగజారిన రిలయన్స్ గ్రూప్(ఏడీఏ) అధినేత అనిల్ అంబానీ మరింత చిక్కుల్లో పడ్డారు. రిలయన్స్ గ్రూపునకు చెందిన రూ.800 కోట్ల విలువైన వెల్లడించని విదేశీ ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించి అనిల్ అంబానీపై నల్లధన చట్టం ప్రయోగిస్తూ ఆదాయ పన్ను విభాగం ఆదేశాలు జారీ చేసింది.
‘ఫారెన్ ట్యాక్స్ అండ్ ట్యాక్స్ రీసెర్చ్ (ఎఫ్‌టీటీఆర్)’ ముంబై విభాగం మార్చి 2022లో ఈ ఆదేశాలను జారీ చేసింది. రూ.800 కోట్ల లావాదేవీలతో ముడిపడిన విదేశీ బ్యాంక్ అకౌంట్లు, విదేశీ కంపెనీలు, లావాదేవీల వివరాలను ఇందులో   వెల్లడించింది. రూపీ-డాలర్ ప్రస్తుత మారకం ఆధారంగా ఈ విలువను లెక్క గట్టినట్టు స్పష్టం చేసింది.
వాస్తవానికి రూ.800 కోట్ల విదేశీ ఆస్తులను 2019లోనే గుర్తించారు. వీటికి సంబంధించి మార్చి 2022లో నల్లధన చట్టం ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఆదాయ పన్ను విభాగం అధికారులు అడిగిన ప్రశ్నలకు అనిల్ అంబానీ కంపెనీ నుంచి సమాధానం రాలేదని సమాచారం.
కాగా రిలయన్స్ గ్రూప్ దివాళా తీసినట్టు 2020లో యూకే కోర్టుకు అనిల్ అంబానీ వెల్లడించారు. తన నికర ఆస్తుల విలువ సున్నాగా పేర్కొన్నారు. 3 చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల విషయంలో అనిల్ అంబానీ ఈ సమాధానమిచ్చారు.
కాగా, బీఎంఏ జారీ చేసిన ఆదేశాల్లో పలు కీలకమైన వివరాలు ఉన్నాయి. బహమాస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ దేశాల్లో ఉన్న విదేశీ కంపెనీ లబ్దిదారు అనిల్ అంబానీయేనని ఆదాయ పన్ను శాఖ పేర్కొంది. బహమస్‌లో డైమండ్ ట్రస్ట్‌ను 2006లో స్థాపించారని వివరించింది. డ్రీమ్‌వర్క్ హోల్డింగ్ కంపెనీ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు.
ఇందుకు సంబంధించి బహమాస్ ప్రభుత్వం నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) విభాగం ఫారెన్ ట్యాక్స్ అండ్ ట్యాక్స్ రీసెర్చ్(ఎఫ్‌టీటీఆర్)కి సమాచారం అందిందని వెల్లడించింది. ఈ సమాచారంలో స్విస్ బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది. జ్యూరిచ్‌లోని యూబీఎస్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఈ ఖాతా ఉందని చెప్పారు. 2010లో మరో కంపెనీని స్థాపించారని రిపోర్ట్ పేర్కొంది.