బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యువనేత హర్దిక్‌ పటేల్ గురువారం బీజేపీలో చేరారు. గుజరాత్ లోని పార్టీ ఆఫీసులో బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు ట్విట్టర్ వేదికగా తన జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు కాబోతుందని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో చిన్న సైనికుడిగా పని చేయబోతున్నట్లు హర్దిక్‌ తెలిపారు. 

ప్రధాని మోదీ మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారని హార్దిక్ ఈ సందర్భంగా కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో సంతోషంగా లేని ప్రజల కోసం బీజేపీలో చేరుతున్నట్లు హార్దిక్ తెలిపారు. గాంధీనగర్ బీజేపీ పార్టీ కార్యాలయంలో హార్దిక్ కు శుభాకాంక్షలు తెలుపుతూ, భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి.

పార్టీ రాష్ట్ర కార్యాయలంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు సీఆర్ పాటిల్  హార్దిక్‌కు కండువా కప్పటి బీజేపీలోకి ఆహ్వానించారు. తాను బీజేపీలో చేరింది జాతీయవాదం, రాష్ట్రవాదం, ప్రజావాదం, సామాజివాదాలతోనని హార్దిక్ పటేల్ ఈ సందర్భంగా తెలిపారు. 

‘‘నేనెప్పుడూ ఏ పదవి కోసం ఎవరినీ అడగలేదు. ఒక కార్యకర్తలా పని చేసేందుకే బీజేపీలో చేరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన పని చేయనీయదని నేను భావించాను. వేరే పార్టీలు కూడా అలాగే ఉన్నాయని అనుకుంటున్నా. అందుకే ఇతర పార్టీల నాయకులంతా బీజేపీలో చేరాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని పిలుపిచ్చారు. 

హర్దిక్‌ ఈ నెల 18న కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పటేల్ వివిధ వేదికలపై కాంగ్రెస్‌పై విమర్శల దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ పాటిదార్ వ్యతిరేకం, గుజరాత్ వ్యతిరేకం అని పేర్కొన్నారు.

2019లో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్ పటేల్‌ 2020, జూలై 11న గుజరాత్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియామకమయ్యారు. ఆ తర్వాత పార్టీ అధిష్టానం, నాయకత్వం తీరుపై విసుగు చెంది రాజీనామా చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు హార్దిక్ పార్టీని విడడంతో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.