కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి క‌రోనా

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. గతంలో సోనియా గాంధీని కలిసిన చాలా మంది నాయకులు, కార్యకర్తలు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింద‌ని ఆయన పేర్కొన్నారు. 

సోనియా గాంధీకి నిన్న బుధవారం సాయంత్రం తేలికపాటి జ్వరం వచ్చింది, ఆ తర్వాత ఆమెకు కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చింది. సోనియా గాంధీ ఐస‌లేష‌న్ లో ఉన్నార‌ని సుర్జేవాలా తెలిపారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. జూన్ 8లోపు సోనియా బాగుంటుందని సూర్జేవాలా ఆశాభావం వ్యక్తం చేశారు.

జూన్ 8న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమెను విచారణకు పిలిచింది. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన కేసులో విచారణ జరగాల్సి ఉంది. సోనియా గాంధీ 2-3 రోజుల్లో కోలుకుంటారని ఆశిస్తున్నట్లు సూర్జేవాలా చెప్పారు.

ఇలా ఉండగా, ప్రధాని నరేంద్ర  మోదీ ట్విటర్‌ వేదికగా కరోనా నుంచి  సోనియా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘కాంగ్రెస్‌ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా జీ.. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

విచారణకు హాజరు కాలేనన్న రాహుల్ 

కాగా ఈడీ విచారణకు హాజరుకావడంలేదని రాహుల్గాంధీ సమాచారం పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు ఉన్నందున హాజరుకావడం లేదని రాహుల్ పేర్కొన్నట్లు వెల్లడించింది. నిన్న సాయంత్రం ఈడీకి ఈ విషయాన్ని వివరిస్తూ రాహుల్ గాంధీ మెయిల్ పంపారు. నేషనల్ హెరాల్డ్ కుంభకోణం కేసులో హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని మెయిల్ పంపినట్లు ఈడీ వెల్లడించింది

రాహుల్ గాంధీని  గురువారం విచారణకు హాజరు కావాలని కోరారు.  రాహుల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. మే 20 నుంచి 23 వరకు లండన్‌లో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆ తర్వాత భారత్‌కు తిరిగి రాలేదు. జూన్ 5 నాటికి భారత్‌కు తిరిగి వస్తార‌ని తొలుత  వార్తలు వచ్చాయి.

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీలకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో వారిద్దరినీ ప్రశ్నించనున్నట్టు బుధవారం జారీ చేసిన ఆ సమన్లలో ఈడీ పేర్కొంది. 

రాహుల్‌ గురువారం, సోనియా ఈనెల 8వ తేదీన ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి రావాలని అందులో స్పష్టం చేసింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్‌ సెక్షన్ల కింద వారిద్దరి వాంగ్మూలాలూ నమోదు చేయనున్నట్టు తెలిపింది.