నేపాల్ లో కుప్పకూలిన విమానం — 22 మంది మృతి!

నేపాల్‌లో ఆదివారం ఉదయం బయలుదేరిన వెంటనే గల్లంతైన విమానం ప్రమాదానికి గురైనట్లు వెల్లడయింది. అయితే విమానం కూలిన ప్రదేశాన్ని సాయంత్రం వరకూ గుర్తించలేకపోయారు. గాలింపు చర్యలను కూడా ఆదివారం సాయంత్రానికి ముగించారు. 
 
అయితే, సోమవారం ఉదయం తిరిగి  గాలింపు చర్యలు ప్రారంభించగా విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించారు.  విమానంలో 22 మంది ఉండగా, వీరిలో నలుగురు మహారాష్ట్రకు చెందిన భారతీయులు.  తారా ఎయిర్‌కు చెందిన 9 ఎన్‌ఎఈటి ట్విన్‌ఇంజిన్‌ విమానం ఆదివారం ఉదయం 9:55 గంటలకు పొఖారా నుంచి జామ్‌సోమ్‌కు బయలుదేరింది. తరువాత 15 నిమిషాలలోపే ఎటిసితో సంబంధాలు తెగిపోయాయి. విమానం ఆచూకీ కోసం 5 గంటలకు పైగా అన్వేషించారు.
 
సాయంత్రం సమయంలో మనపతి హిమాల్‌ పర్వత ప్రాంతంలో లాంచే నదీ ముఖద్వారం వద్ద కూలిపోయిందని సమాచారం అందింది. దీంతో సంఘటనా స్థలానికి నేపాల్‌ ఆర్మీ చేరుకోవడానికి ప్రయత్నం చేసింది. అయితే సాయంత్రానికి కూడా అక్కడకు ఆర్మీ చేరుకోలేకపోయింది. మంచు కురుస్తున్న కారణంగా ఆదివారం సాయంత్రానికి గాలింపు చర్యలను ఆర్మీ నిలిపివేసింది. సోమవారం ఉదయం గాలింపు చర్యలను కొనసాగించారు.

కాగా, ప్రమాదానికి గురైన తారా ఎయిర్‌ విమానంలో మొత్తం 22 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో నలుగురు భారతీయులు, ఇద్దరు జర్మన్‌వాసులు, 13 మంది నేపాల్‌కు చెందినవారుగా గుర్తించారు. ఇప్పటికే ప్రయాణికుల వివరాలను సేకరించిన అధికారులు వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని చెప్పారు. 
 
గల్లంతయిన నలుగురు భారతీయులను అశోక్‌ కుమార్‌ త్రిపాఠి, ధనుష్‌ త్రిపాఠి, రితికా త్రిపాఠి, వైభవి త్రిపాఠీలు ముంబయికి చెందిన వారిగా గుర్తించారు. తారా ఎయిర్‌ అనేది ఏతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన అనుబంధ సంస్థ.  ప్రైవేట్‌ యాజమాన్యంలోని ఈ సంస్థ నేపాల్‌ వ్యాప్తంగా సేవలు అందిస్తుంది. 2016లోనూ ఇదే మార్గంలో తారా ఎయిర్‌ విమానం ఒకటి కూలిపోయింది. ఆ ప్రమాదంలో విమానంలో ఉన్న 23 మందీ మరణించారు.