మరో కీలక ప్రాంతం లిమాన్‌ రష్యా దళాల వశం

ఉక్రెయిన్‌కు చెందిన మరో కీలకమైన ప్రాంతం లిమాన్‌ తమ వశమెనట్లు రష్యా దళాలు శనివారం ప్రకటించాయి. ఉక్రెయన్‌కు గట్టి పట్టు ఉన్న తూర్పు ప్రాంతం డానెట్స్క్‌లోని లిమాన్‌ పట్టణం రష్యాపరమైనట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుని సలహాదారు అలెక్సీ అరెస్టోవిచ్‌ అంగీకరించారు. 
 
అంతకుముందు ఆయన దావోస్‌లో పశ్చిమ దేశాల నేతలతో ఆన్‌లైన్‌ సమావేశంలో మాట్లాడుతూ డాన్‌బాస్‌లో పరిస్థితి చాలా అధ్వానంగా తయారైందని, ఉక్రెయిన్‌ దళాలు చేతులెత్తేస్తున్నాయని పేర్కొన్నారు. యుద్ధంలో నిలవాలంటే తమకు మరిన్ని ఆయుధాలు కావాలని అమెరికా, యూరప్‌ దేశాలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రాధేయపడ్డారు. 
 
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలకు తాను సుముఖమేనని తెలిపారు. రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇగోర్‌ కొనషెంకోవ్‌ మాట్లాడుతూ లిమాన్‌ పట్టణాన్ని ఉక్రెయినియన్‌ ఫాసిస్టుల నుంచి పూర్తిగా విముక్తి చేసినట్లు తెలిపారు. శాంతి చర్చలు ప్రతిష్టంభనకు కారణమైన ఉక్రెయిన్‌ ఇప్పుడు చర్చల పునరుద్ధరణ గురించి మాట్లాడడం దాని చిత్తశుద్ధిలేమిని తెలియజేస్తోందని ధ్వజమెత్తారు. 
 
మరో వైపు జెలెన్‌స్కీ అభ్యర్థన మేరకు అమెరికా ఎం-270 ఎంఎల్‌ ఆర్స్‌ వంటి అధునాతన ఆయుధాలను, దీర్ఘ శ్రేణి లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థలను ఉక్రెయిన్‌కు పంపేందుకు బైడెన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు అమెరికన్‌ మీడియా సంస్థలు తెలిపాయి. 
 
దీనిపై అమెరికాలోని రష్యా రాయబారి అనతొలి ఆంటోనోవ్‌ స్పందిస్తూ ఉక్రెయిన్‌కు క్షిపణి వ్యవస్థలను అమెరికా పంపితే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికాను హెచ్చరించారు. మరోవంక, తూర్పు ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేస్తోంది. జిక్రాన్ హైపర్ సోనిక్ క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. 
 
వెయ్యి కిలో మీటర్ల దూరంలో తెల్ల సముద్రంలో లక్ష్యాన్ని ఛేధించినట్టు వెల్లడించింది. ప్రస్తుత క్షిపణి నిరోధక వ్యవస్థలు ఏవీ జిక్రాన్ నిలువరించలేవని రష్యా తెలిపింది. క్షిపణిని మోహరిస్తే సైనికశక్తి మరింత ఇనుమడిస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు.
 
బారెంట్స్ సీలోని అడ్మిరల్ గోర్షకోవ్ యుద్ధనౌక నుంచి దీనిని వేయి కిలోమీటర్ల దూరంలో అర్కిటిక్‌లోని వైట్ సీలో ఉన్న టార్గెట్‌పైకి ప్రయోగించారు. ఈ క్రమంలో పూర్తి స్థాయి విజయం సాధించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో తాము తలపెట్టిన వినూత్న ఆయుధాల పనితీరు సామర్థ పాటవ పరీక్షల క్రమంలో ఇప్పుడీ క్షిపణిని ప్రయోగించి చూసుకున్నట్లు వివరించారు.
 
జిక్రాన్ శ్రేణి క్షిపణుల తొలి అధికారిక పరీక్ష ఇదేనని , ఇది విజయవంతం కావడం రష్యాకు ఘనమైన ఘట్టం అని అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఇటువంటి క్షిపణుల రూపకల్పన జరిగి రెండేళ్లు అయింది. ఇప్పుడు వీటి సామర్థపు పరీక్షలు ఆరంభం అయ్యాయి. ఇక ముందు విరివిగా సాగుతాయని తెలిపారు.
 
ఇప్పుడు జిక్రాన్ క్షిపణిని సముద్రంలోని జలాంతర్గామి నుంచి పరీక్షించారు. ఇప్పటి ప్రయోగ కేంద్రం నుంచే ఇంతకు ముందటిలాగానే తమ నూతన ఆయుధాల వ్యవస్థ పనితీరును పరీక్షించుకోవడం జరుగుతుందని పుతిన్ తెలిపారు.