దావోస్‌ వేదికపై హెల్త్‌ కేర్‌ లో భారత్ కు ప్రశంసలు

ప్రపంచ దేశాల్లో ఆరోగ్య రంగంలో క్యూబా అగ్రస్థానంలో ఉంది. చిన్న దేశమైనా, కరోనా మహమ్మారిని అరికట్టిన వైనం ప్రపంచదేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో ఆరోగ్యరంగంలో అగ్రస్థానంలో ఉన్న క్యూబా ఇప్పుడు భారత్ పై  ప్రశంసలు కురిపించింది.
వైద్యారోగ్య రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతి, ఆరోగ్యం రంగంలో చేస్తున్న అద్భుత కృషి, సాధిస్తున్న ఫలితాలు ఆశ్చర్య పరుస్తున్నాయని క్యూబా ఆరోగ్యశాఖ మంత్రి జోస్‌ ఏంజెల్‌ పోర్టల్‌ మిరాండా ప్రశంసించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో భారత ఆరోగ్య మంత్రి  డా. మాన్‌సుఖ్‌మాండవియా, క్యూబా మంత్రి జోస్‌ ఏంజెల్‌ పోర్టల్‌ మిరాండాలు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మిరాండా, ఆరోగ్యరంగంలో భారత్‌ సాధిస్తున్న గణనీయమైన ప్రగతిని ప్రశంసించారు. రెండు దేశాల మంత్రుల మధ్య ఫార్మా రీసెర్చ్‌, మాన్యుఫాక్చరింగ్‌ రంగాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా, ఫార్మా రీసెర్చ్‌, మాన్యుఫాక్చరింగ్‌ రంగాల్లో కలిసి సంయుక్తంగా పని చేయాలని ఇరు దేశాల మంత్రులూ నిర్ణయించారు.
హెల్త్‌ కేర్‌ రంగంలో భారత్ ప్రవేశపెడుతున్న నూతన ఆవిష్కరణలను క్యూబా మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా ఇరుదేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడం ఎలా అనే అంశంపై కూడా ఇరుదేశాల మంత్రులు చర్చించారు.
క్యూబా ఆరోగ్యశాఖ మంత్రి మాండవియా దావోస్‌ సదస్సులోనే కాకుండా ఈనెల 23న జెనీవాలో జరిగిన ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ  75వసదస్సులో సైతం వైద్యారోగ్య రంగంలో భారత్ సాధించిన ప్రగతిని ప్రశంసించారు. ఈ సందర్భంగా,  చారిత్రాత్మక ప్రసంగంలో, మాండవ్య మరింత స్థిరమైన ప్రపంచ ఆరోగ్య భద్రతా నిర్మాణాన్ని నిర్మించడానికి భారతదేశపు నిబద్ధతను పునరుద్ఘాటించారు.

శాంతి లేకుండా స్థిరమైన అభివృద్ధి, సార్వత్రిక ఆరోగ్యం, శ్రేయస్సు ఉండదని స్పష్టం చేస్తూ ఈ సంవత్సరం శాంతి, ఆరోగ్యాన్ని కలిపే థీమ్ సమయానుకూలమైనదని  భారతదేశం విశ్వసిస్తుందని ఆయన  తెలిపారు. మంగళవారం రాత్రి 7 గంటల నాటికి 192.52 కోట్లకు చేరుకోవడంతో భారతదేశపు కరోనా టీకా కార్యక్రమం ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వాటిలో ఒకటిగా మారిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.