మహిళలపై తాలిబన్ ఆంక్షల పట్ల ఐరాస ఆందోళన

మహిళలపై తాలిబన్‌లు విధిస్తున్న ఆంక్షలను ఐక్యరాజ్యసమితి ఆఫ్ఘనిస్తాన్‌ మావనహక్కుల ప్రత్యేక ప్రతినిధి ఖండించారు. తాలిబన్‌లు మహిళలపై వరుసగా విధిస్తున్న ఆంక్షలు, మైనారిటీలపై దాడులు పెరగడంతో దేశంలో దిగజారుతున్న పరిస్థితులపై రిచర్డ్‌ బెన్నెట్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

తన పర్యటనలో భాగంగా బెన్నెట్‌ తాలిబన్‌ నేతలు, పౌరహక్కుల నేతలు, కార్యకర్తలు, హజారాలతో సహా మైనారిటీ వర్గాలతో సమావేశమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌లో 11 రోజుల పర్యటన ముగింపు సందర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడారు. 

ప్రస్తుత తాలిబన్‌ ప్రభుత్వం హక్కుల దుర్వినియోగం, వాటి తీవ్రతను గుర్తించడంలో విఫలమైందని విమర్శించారు. వాటిని పరిష్కరించడం, దేశ జనాభాను రక్షించడం వారి బాధ్యతని స్పష్టం చేశారు. 

తమ పేరుతో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనల తీవ్రతను గమనించడం గాని, వాటికి  బాధ్యత వహించడం గాని తాలిబన్లు చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న మానవహక్కుల సవాళ్ల పట్ల దృష్టి సారించాలని, తమ మాటలకు, చేతలకు మధ్య గల వ్యత్యాసాన్ని సరిదిద్దుకోవాలని ఆయన హితవు పలికారు. 

దేశవ్యాప్తంగా మానవ హక్కులు క్షీణించడం గురించి తాను తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నానని ముఖ్యంగా ప్రజా జీవితం నుండి మహిళలను దూరం చేయడం బాధాకరమని పేర్కొన్నారు.

ఆఫ్ఘన్‌ బాలికలు, మహిళలకు మానవహక్కులు, వారి స్వేచ్ఛను పరిమితం చేసే విధానాలను తిప్పి కొట్టాలని తాలిబన్‌లకు ఆయన  పిలుపునిచ్చారు. ఇటీవల మీడియాలోని మహిళా రిపోర్టర్లు సహా మహిళలంతా బురఖా ధరించాల్సిందేనంటూ తాలిబన్‌లు ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. 

ఆ శాసనాలను పాటించని మహిళల బంధువులను శిక్షించడం ద్వారా ఆదేశాలు అమలు చేయబడతాయని పేర్కొన్నారు. అలాగే ఆరో తరగతి అనంతరం బాలికలు పాఠశాలకు వెళ్లకుండా నిషేధం విధించింది.