ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళను ఆర్మీ చీఫ్‌గా నియమించారు. ప్రస్తుతం జాయింట్ క్యాపబిలిటీస్ విభాగాధిపతిగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ సూసన్ కోయిల్ జూలైలో ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. లెఫ్టినెంట్ జనరల్ సైమన్ స్టీవార్ట్ స్థానంలో సూసన్ నియమితులవుతారు. దేశ సైనిక చరిత్రలో ఇంతటి ఉన్నత పదవికి ఒక మహిళా అధికారిని ఎంపిక చేయడం ఇదే మొదటిసారి.
ఈ నిర్ణయం రక్షణ రంగంలో లింగ సమానత్వానికి, దళాల ఆధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆస్ట్రేలియన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. “జూలై నుండి, ఆస్ట్రేలియన్ సైన్యం 125 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళా సైన్యాధిపతి మనకు లభించనున్నారు,” అని ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ఒక ప్రకటనలో తెలిపారు.
సైన్యంలోని కమాండ్, కంట్రోల్ విభాగాలలో ఆమెకున్న సుదీర్ఘ అనుభవం, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఆమెకున్న నైపుణ్యం కారణంగా సూసన్ కోయిల్‌ను ఈ పదవికి నియమించారు. సైన్యంలోని అన్ని స్థాయిలలో మహిళలకు అధిక ప్రాతినిధ్యం కల్పించే లక్ష్యంతో ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్ అమలు చేస్తున్న సంస్కరణలలో ఈ నియామకం ఒక భాగం.
ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్ లైంగిక వేధింపులు, వివక్షకు సంబంధించిన అనేక ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఒక మహిళ దళాధిపతి పదవికి పదోన్నతి పొందుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సూసన్ నియామకాన్ని ఒక “చారిత్రాత్మక ఘట్టం”గా రక్షణ మంత్రి రిచర్డ్ మాలెస్ అభివర్ణించారు.
1987లో దళంలో చేరిన 55 ఏళ్ల సూసన్ కోయిల్, అనేక ఉన్నత కమాండ్ పదవులను నిర్వహించారు. ఆస్ట్రేలియా సైనిక దళాల (సైన్యం, నావికాదళం, వైమానిక దళం) ఏ విభాగానికైనా నాయకత్వం వహించిన తొలి మహిళ సుసాన్ అవుతారని మాలెస్ తెలిపారు. ప్రస్తుతం, ఆస్ట్రేలియన్ రక్షణ దళం (ఎడిఎఫ్)లో మహిళల వాటా సుమారు 21%గానూ, ఉన్నత నాయకత్వ బాధ్యతల్లో వారి వాటా 18.5%గానూ ఉంది. 2030 నాటికి మహిళల మొత్తం భాగస్వామ్యాన్ని 25 శాతానికి చేర్చాలని ఎడిఎఫ్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

More Stories
హొర్ముజ్ దిగ్బంధం.. ఇరాన్ నౌకల రాకపోకలు బంద్
హంగేరి ప్రధానిగా వివక్ష నేత పీటర్ మాగ్యార్ ఎన్నిక
మక్కా ప్రవేశంపై సౌదీ అరేబియా కీలక ఆంక్షలు