టెక్సాస్ ఎలిమెంటరీ స్కూల్ కాల్పుల్లో 21 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు  కలకలం రేపాయి. టెక్సాస్ లోని ఎలిమెంటరీ స్కూల్ లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 19 మంది స్కూల్ పిల్లలు, మరో ఇద్దరు వయోజనులు చనిపోయారు. మొత్తం 21 మంది కాల్పులకు బలయ్యారు. 2012 తర్వాత స్కూళ్లలో ఈ స్థాయిలో ఫైరింగ్ జరగడం ఇదే తొలిసారి. 

కాల్పులు జరిపింది 18 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. అతడు కూడా అక్కడే చనిపోయాడు. ఒక్కసారిగా స్కూల్ లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 19 మంది పిల్లలు చనిపోయారు. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల గురించి తెలుసుకున్న తల్లితండ్రులు స్కూల్ దగ్గరకు పరుగులు తీశారు. తమ పిల్లల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ దారుణ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పులను ఖండించారు. గన్ కల్చర్ పై ఇప్పటికైనా చర్యలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. చనిపోయిన విద్యార్థుల వయసు 4 నుంచి 11 ఏళ్ల మధ్య ఉందని టెక్సాస్ పోలీసులు తెలిపారు. ఈ స్కూల్ లో మొత్తం 500 మందికి పైగా స్టూడెంట్స్ ఉన్నారు.

దుండగుడు తుపాకీతో రోబ్ ఎలిమెంటరీ స్కూళ్లోకి వెళ్లాడని గవర్నర్ అబాట్ చెప్పారు. అతని దగ్గర రైఫిల్ కూడా ఉండొచ్చని తెలిపారు. 2018 లో ఫ్లోరిడాలోని పార్క్ ల్యాండ్ లో జరిపిన కాల్పుల్లో 14 మంది హైస్కూల్ విద్యార్థులు, ముగ్గురు టీచర్లు చనిపోయారు. దాని తర్వాతే ఇదే అత్యంత దారుణ ఘటన అని అధికారులు చెప్తున్నారు. 
 
2020 వ సంవత్సరం మొత్తంలో అమెరికాలో జరిగిన కాల్పుల్లో 19,350 మంది చనిపోయారు. ఇది 2019 తో పోలిస్తే 35 శాతం ఎక్కువని సెంటర్స్ ఫర్ డసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. తాజాగా ఎలిమెంటరీ స్కూల్ లో జరిగిన కాల్పులతో అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.