అమలాపురంలో అల్లర్లు… మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడులు

కోనసీమ జిల్లాకు అంబేత్కర్  పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు అదుపు తప్పి హింసాత్మకంగా మారాయి. 144 సెక్షన్‌ విధించిన నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు.
 
జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనం రాళ్లదాడి చేశారు.  ఈ దాడుల్లో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. 2 ప్రైవేట్‌ కాలేజ్‌ బస్సులు దగ్ధం చేశారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు.  ముమ‍్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇంటిని ఆందోళనకారులు దగ్ధం చేశారు.  దీంతో పోలీసులు ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.
 
హౌసింగ్‌బోర్డు కాలనీలోని సతీష్‌ ఇంటికి నిప్పుంటించడంతో  అధికార పార్టీ నేతల ఇళ్లను పోలీసులు ఖాళీ చేయించారు. అమలాపురంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అటు అమలాపురం చేరుకున్న ఏలూరు రేంజ్‌ డీఐజీ పాల్‌రాజ్‌ పరిస్థితిని సమీక్షించారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం కోనసీమ పేరును ‘బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా’గా మార్చాలని నిర్ణయించింది. ఈనెల 18వ తేదీన ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ప్రజలకు సూచించింది. ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ రోజు నుంచే పేరు మార్పుపై జిల్లాలో నిరసనలు మొదలయ్యాయి. కోనసీమ జిల్లా పేరు యథాతథంగా కొనసాగించాలంటూ పార్టీలకు అతీతంగా ఎస్సీయేతర కులాల వారు  కోనసీమ జిల్లా సాధన సమితిగా ఏర్పడ్డారు.
 
జిల్లా పేరును యథాతథంగా కొనసాగించాలంటూ ఈనెల 19 నుంచే ‘కోనసీమ జిల్లా పేరు సాధన సమితి’ పేరుతో కొందరు యువకులతో జేఏసీ ఏర్పాటైంది. ఎక్కువ మంది 30 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న వారే. వాట్సా్‌పలో సమాచారం చేరవేసుకుంటూ ఉద్యమాలకు సిద్ధమయ్యారు. సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌కు వెళ్లి వినతిపత్రాలు ఇవ్వాలనుకున్నా… పోలీసులు 144 సెక్షన్‌ పేరుతో ఇళ్లు కదలనీయలేదు. 
 
ఇలా తమను కట్టడి చేసి ఇబ్బంది పెడుతున్నారనే ఆగ్రహంతో మంగళవారం కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న వారి ఇంటింటికీ వెళ్లి గృహనిర్బంధం చేశారు. దీనిని ముందుగానే ఊహించిన కొందరు అమలాపురం పట్టణంలో ముందురోజే పలు హోటళ్లలో, బంధువుల ఇళ్లల్లో  బస చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అమలాపురంలోని పలు కూడళ్లలో ప్రత్యక్షమయ్యారు. 
 
ఊహించని పరిణామాలతో కోనసీమ జిల్లాలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు బిక్కుబిక్కుమని గడిపారు. మంత్రితోపాటు మరో ఎమ్మెల్యే ఇంటికి నిప్పుపెట్టడంతో ఆగ్రహావేశాలు జ్వాలలా వ్యాపించి తమను చుట్టుముడతాయనే భయంతో కొందరు కుటుంబ సభ్యులతో కాకినాడ, రాజమహేంద్రవరంలలో హోటళ్లకు వెళ్లారు. అటు పోలీసులు సైతం ముందు జాగ్రత్త చర్యగా నేతల ఇళ్లవద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
టిడిపి, జనసేన హస్తం 
 
 కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని హోం మంత్రి తానేటి వనిత   మండిపడ్డారు. దీని వెనుక టీడీపీ, జనసేన పార్టీలున్నాయన్న అనుమానం ఉందని ఆమె పేర్కొన్నారు.  గొడవలు చేసే వారి వెనుక ఉండి నడిపించే వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. 
 
“ఈ రోజు 20 మందికి పైగా పోలీసులపై రాళ్లు రువ్వి గాయపరిచారు. స్కూల్ బస్సు లను కూడా తగులబెట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కొన్ని శక్తులు కుట్ర పూరితంగా ప్రయత్నిస్తున్నాయి. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది” అని ఆమె హెచ్చరించారు. 
 
పోలీసులపై జరిగిన దాడిని ఆమె ఖండిస్తూ  ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై తప్పక చర్యలు ఉంటాయని తెలిపారు.  ఆందోళనకారులను, వారి వెనుక ఉండి నడిపించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు హోంమంత్రి వెల్లడించారు.  కోనసీమ జిల్లా ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ కోనసీమగా పేరు మార్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాని ఆమె సూచించారు.