దేశంలో అత్యధికంగా అప్పులు చేస్తున్నది తెలుగు రాష్ట్రాలే

రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడటం లేదు. అప్పులు చేయడంలో పోటీ పడుతున్నాయి. సంవత్సరంలో 300 రోజుల పేరుకు అప్పు చేయనిదే గడవని పరిస్థితుల్లో ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. 

 గత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద ఆర్బీఐ నుంచి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్), వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ (డబ్ల్యూఎంఏ), ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో అత్యధిక రోజులు అప్పు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడగా,  ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ  ఉంది.
 
2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 305 రోజులపాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, 283 రోజులు వేస్ అండ్ మీన్స్ (డబ్ల్యూఎంఏ) సదుపాయం కింద అప్పులు పొందిన్నట్లు  ఆర్బీఐ  తాజాగా విడుదల చేసిన డేటా ద్వారా వెల్లడైంది. దేశంలోని మరే రాష్ట్రం కూడా ఈ విధంగా చేయలేదు.
 ఈ సౌకర్యాలు ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉన్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తారు. ఏపీ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో మణిపూర్ నిలిచింది.
గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 17 రాష్ట్రాలు ఎస్ డీఎఫ్, 14 రాష్ట్రాలు వేస్ అండ్ మీన్స్, 9 రాష్ట్రాలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాయి. అస్సాం, బీహార్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వీటిలో దేన్ని ఉపయోగించుకోకపోవడం గమనార్హం.
ఇక మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కేవలం ఒక్కరోజు మాత్రమే ఎస్ డీఎఫ్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాయి. ఈ రుణ సౌకర్యం ఏదో ఒకదాన్ని ఉపయోగించుకున్న మిగిలినవి ఈశాన్య, హిమాలయ ప్రాంతాల రాష్ట్రాలు. కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే మొత్తం మూడు సౌకర్యాలనూ వాడుకున్నాయి. ఆ జాబితాలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాలు కన్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్ లో ప్రతి సంవత్సరం పెట్టే వార్షిక పెట్టుబడుల ఆధారంగా స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అప్పులపై రెపో రేటు కంటే 2 శాతం తక్కువగా వడ్డీ వసూలు చేస్తారు. ఇదే సౌకర్యాన్ని ప్రభుత్వ సెక్యూరిటీల ఆధారంగా వాడుకుంటే 1 శాతం మాత్రమే తక్కువ వడ్డీ ఉంటుంది.

ఎస్ డీఎప్, వేస్ అండ్ మీన్స్ సౌకర్యాలు పూర్తయిన తర్వాత కూడా ఆర్థిక అవసరాలు తీరకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటాయి. వేస్ అండ్ మీన్స్ కింద అర్హత ఉన్న మొత్తానికి సమానంగా తీసుకుంటే 2 శాతం, 100శాతానికి మించి తీసుకుంటే 5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. 
 
రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం రోజువారీ అవసరాలకు సరిపోనప్పుడు ఇవి ఆర్బీఐ వద్ద స్వల్ప కాలానికి ఈ మూడింటిలో ఏదైనా ఒక సౌకర్యం ద్వారా అప్పు చేస్తుంటాయి. అయితే, ఈ సౌకర్యాలను అత్యధిక రోజులు ఉపయోగించుకున్న రాష్ట్రాలు వడ్డీ రూపంలో ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయని స్పష్టం అవుతుంది.