టోక్యోలో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల బ్రహ్మరథం

క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు సోమవారం జపాన్ దేశంలోని టోక్యో నగరానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రవాస భారతీయులు బ్రహ్మరథం పట్టారు.రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వచ్చిన నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. టోక్యోలో మోదీ బస చేసిన హోటల్ న్యూ ఒటానీలో భారతీయ ప్రవాసుల నుంచి ఘన స్వాగతం లభించింది.

“హర్ హర్ మోదీ’’, ‘‘మోదీ మోదీ’’, వందేమాతరం, భారత్ మాతా కీ జై నినాదాలు హోటల్ వద్ద ప్రతిధ్వనించాయి, ప్రవాస భారతీయులు ప్రధాన మంత్రిని చూసి జాతీయ జెండాలు ఊపారు.ప్రధాని రాక సందర్భంగా చిన్నారులు సైతం చేతులు ఊపుతూ పాల్గొన్నారు.పిల్లలు వివిధ భాషల్లో స్వాగతం అని రాసిన ప్లేకార్డులను పట్టుకుని కనిపించారు. 

ప్రధాని అక్కడ ఉన్న పిల్లల్లో ఒకరితో సంభాషించారు. బాలుడి కోసం ప్రధాని ఆటోగ్రాఫ్‌పై సంతకం చేశారు. ‘‘వా! నువ్వు హిందీ ఎక్కడ నేర్చుకున్నావు?… నీకు బాగా తెలుసా?’’ అంటూ భారతీయ పిల్లలతో ప్రధాని మోదీ మాట్లాడారు .ప్రధాని జపాన్ పర్యటన సందర్భంగా ప్రవాస భారతీయులు సంతోషం వ్యక్తం చేశారు.

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు మే 24న క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ టోక్యో చేరుకున్నారు. టోక్యోలో దిగిన తర్వాత ‘‘టోక్యోలో ల్యాండ్ అయ్యాను. ఈ పర్యటనలో క్వాడ్ సమ్మిట్, తోటి క్వాడ్ నేతలను కలవడం, జపాన్ వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో సంభాషించడం వంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటాను’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

ప్రధానమంత్రి మోదీ సోమవారం ఎన్ఈసీ కార్పొరేషన్ చైర్మన్ నోబుహిరో ఎండో,  సీఈవో తదాషి యానై, సుజుకి మోటార్ కార్పొరేషన్ సలహాదారు ఒసాము సుజుకీ, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్‌లో బోర్డు డైరెక్టర్ మసయోషి సన్‌లతో సమావేశం కానున్నారు.