జపాన్ లో 40 గంటల్లో 23 సమావేశాల్లో ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ  క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు రేపు జపాన్‌ వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోడీ జపాన్‌, ఆస్ట్రేలియా ప్రధానులు ఫుమియో కిషిద, స్కాట్‌ మారిసన్‌లతో సమావేశం కానున్నారు. జపాన్‌ ప్రధాని కిషిద ఆహ్వానం మేరకు మోదీ  టోక్యో వెళ్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.

అంతర్జాతీయ సమస్యలు, ఇండో- పసిఫిక్‌ ప్రాంత పరిణామాలు, క్వాడ్‌ దేశాల ఉమ్మడి అంశాలపై అగ్రనేతలు పరస్పరం తమ అభిప్రాయాలు పంచుకునేందుకు. భవిష్యత్తు కార్యాచరణపై సదస్సులో చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా మోదీ  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో భేటీ కానున్నారు. 

ఇరు దేశాల మధ్య సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలు భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షిస్తారని భావిస్తున్నారు.

జపాన్ పర్యటనలో భాగంగా మోదీ  40 గంటలు ఆ దేశంలో గడుపనున్నారు. ఈ సమయంలో ఆయన మొత్తం 23 సమావేశాల్లో పాల్గొంటారు. జపాన్‌ కు చెందిన 30 మంది సీఈవోలు, దౌత్యవేత్తలు, అక్కడ స్థిరపడిన భారతీయులతో మోదీ సమావేశమవుతారు.

పసిఫిక్ , హిందూ మహాసముద్రంలో విస్తరించి ఉన్న ఆర్థిక మరియు భద్రతా ప్రయోజనాలపై వీరు చర్చించనున్నారు . ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అక్రమ చేపల వేటను నిరోధించే లక్ష్యంతో క్వాడ్ దేశాలు ఉపగ్రహ ఆధారిత సముద్ర చొరవను చేపట్టాలని వారు  భావిస్తున్నారు. 

ఫిషింగ్ బోట్లు ట్రాన్స్‌పాండర్‌లను ఆపివేసినప్పుడు కూడా అక్రమ చేపల వేటను పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థ క్వాడ్ దేశాలను అనుమతిస్తుంది. ఆరోపిత అక్రమ చేపల వేట నుండి చైనాను నిరోధించడం ఈ ప్రయోగం లక్ష్యం. ఇండో-పసిఫిక్‌లో జరుగుతున్న 95 శాతం అక్రమ చేపల వేటలో  ఆ దేశమే కారణమని ఆరోపణ.

టోక్యో వేదకగా ఈనెల 23, 24 తేదీల్లో జరగనున్న క్వాడ్‌ సదస్సు నాలుగు దేశాల నేతలకు ఒక చక్కటి అవకాశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంత పరిణామలతో పాటు అంతర్జాతీయ సమస్యలు, క్వాడ్ దేశాల ఉమ్మడి అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకునేందుకు, ప్రగతిని సమీక్షించేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. 
 
ఆదివారంనాడు ఆయన జపాన్ పర్యటనకు బయలుదేరడానికి ముందు ఈ మేరకు ప్రధాని  ఒక ప్రకటన చేశారు. తన పర్యటనలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కూడా ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటానని, ప్రాంతీయ అభివృద్ధి, సమకాలీన అంతర్జాతీయ సమస్యలపై తాము చర్చిస్తామని చెప్పారు.