కుతుబ్‌ మినార్‌లో తవ్వకాలపై ఆదేశాల్లేవు

ప్రపంచవారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కించుకున్న  ఢిల్లీలోని కుతుబ్‌ మినార్‌లో తవ్వకాలు జరిపాలని భారత పురావస్తు శాఖను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదేశించినట్టు వచ్చిన కథనాలపై ఆ శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి కొట్టిపారవేసారు. ప్రస్తుతానికి అలాంటి ఆదేశాలేమీ ఇవ్వలేదని ఆయన చెప్పారు.

జ్ఞానవాపి మసీదు సర్వే నేపథ్యంలో కుతుబ్‌ మినార్‌ నిర్మాణం కింద కూడా హిందూ, జైన్‌ ఆలయాలున్నాయని హిందువులు విశ్వసిస్తున్నారు. ఇలాంటి సమయంలో కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశించినట్టుగా వార్తలు చక్కెర్లు కొట్టడంతో  ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదని కిషన్ రెడ్డి స్పష్టతనిచ్చారు.  అయితే,  పురావస్తు శాఖ మాత్రం తవ్వకాల విషయంపై స్పందించలేదు. 

మరోవైపు శనివారం కుతుబ్‌మినార్‌ను పురావస్తు శాఖ అధికారులు సందర్శించడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఆర్కియాలజీ సర్వే దీనిని కట్టించెదవరు అనే విషయంపై పరిశోధనలు నిర్వహించబోతున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే అది రెగ్యులర్‌ సందర్శనేని, ఎలాంటి పరిశోధన కోసం రాలేదని అధికారులు ఆ తర్వాత స్పష్టత ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. 12వ శతాబ్ధానికి చెందినదిగా భావిస్తున్న కుతుబ్‌మినార్‌ కట్టడపు కాంప్లెక్స్‌లో ఉన్న రెండు గణేష్‌ విగ్రహాలను  తదుపరి ఆదేశాల ఇచ్చేంతవరకు తొలగించవద్దని గతంలో ఢిల్లీ కోర్టు ఎఎస్ఐని  ఆదేశించింది. రెండు విగ్రహాలను ‘ఉల్టా గణేష్’, ‘పంజరంలో వినాయకుడు’గా పిలుస్తున్నారు. కుతుబ్‌మినార్‌ను యునెస్కో  1993లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

మరోవంక, దేశంలో ఒకప్పుడు ధ్వంసం చేసిన ఆలయాలన్నిటినీ పునర్నిర్మించాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సూచించారు. గోవాలో పోర్చుగీసు పరిపాలనలో ధ్వంసమైన ఆలయాలను తిరిగి నిర్మించడానికి తాము బడ్జెట్‌లో అందుకోసం నిధులు కూడా కేటాయిస్తున్నామని చెప్పారు. గోవాలో సాంస్కృతిక టూరిజంను కూడా ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నామని సావంత్‌ తెలిపారు.