పాక్ ఐఎస్‌ఐ మహిళ మాయలో కీలక సమాచారం లీక్

పాకిస్థాన్ ఐఎస్‌ఐకి చెందిన మహిళ మాయవల (హనీట్రాప్) లో పడి భారత సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేశాడన్న ఆరోపణలపై ఆర్మీ ఉద్యోగి ప్రదీప్ కుమార్ (24)ను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. జోధ్‌పూర్‌లో పనిచేస్తున్న కుమార్‌కు పాకిస్థాన్ ఐఎస్‌ఐకి చెందిన మహిళతో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. 

తాను మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌కు చెందిన హిందూ మహిళనని, తన పేరు చద్దాం అని, బెంగళూరులోని ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నానని కుమార్‌ను నమ్మించింది. ఆ విధంగా పరిచయం పెంచుకున్న తరువాత నుంచి కుమార్ తరచుగా పెళ్లి పేరు చెప్పి ఢిల్లీకి రావడం, భారత సైన్యానికి చెందిన రహస్య దస్త్రాలు అడగడం వంటివి చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ రహస్య సమాచారమంతా ఫోటోల ద్వారా ఆమెకు వాట్సాప్‌లో చేరవేసినట్టు ఆరోపణలున్నాయి. ఆర్నెలల క్రితం వీరిద్దరూ వాట్సాప్‌లో కనెక్టు అయినట్టు పోలీసులు చెబుతున్నారు. కుమార్ వాట్సాప్‌లో కొన్ని డాక్యుమెంట్లను ఆమెకు షేర్ చేశాడని, ఇతర సైనికులను కూడా ఇందులో బలిపశువును చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఇంటెలిజెన్స్ డీజీ ఉమేశ్ మిశ్రా చెప్పారు.

ఇందులో కుమార్ స్నేహితురాలైన మరో మహిళ ప్రమేయం కూడా ఉన్నట్టు గుర్తించారు. గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో విచారణ కోసం కుమార్‌ను ఈ నెల 18న అదుపు లోకి తీసుకున్న పోలీసులు శనివారం అతడిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు.