జ్ఞానవాపి మసీదు కేసు జిల్లా కోర్టుకు `సుప్రీం’ బదిలీ 

ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు కేసులో సర్వే కోసం సివిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణను సివిల్ జడ్జి నుంచి  వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేసింది.
ఈ సర్వేలో కనిపించిన శివలింగం తదితర దేవతలను పూజించే హక్కులను కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరపాలని జిల్లా జడ్జిని ఆదేశించింది.  ఈ మసీదుని నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది.
ఈ  మసీదు సముదాయంలో వీడియోగ్రాఫిక్ సర్వేకు ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మసీదు ప్రాంగణంలో శివలింగం, త్రిశూలం, కమలం వంటి హిందూ సంబంధిత అంశాలు ఈ సర్వేలో కనిపించినట్లు వార్తలు రావడంతో హిందువులు ఇక్కడ పూజలు చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
ఈ కేసును వారణాసి జిల్లా సీనియర్ మోస్ట్ జడ్జి విచారించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. మరింత అనుభవజ్ఞుడైన న్యాయాధికారి విచారణ జరిపితే బాగుంటుందని తెలిపింది. కొన్ని వీడియోలను బయటకు పొక్కేలా చేయడాన్ని ఆపాలని ఆదేశించింది.
‘‘ఈ అంశం సంక్లిష్టత, సున్నితత్వాలను దృష్టిలో ఉంచుకుని, వారణాసిలోని సివిల్ జడ్జి సమక్షంలో విచారణలో ఉన్న సివిల్ దావాను ఉత్తర ప్రదేశ్ జ్యుడిషియల్ సర్వీస్‌లోని సీనియర్, అనుభవజ్ఞుడైన జ్యుడిషియల్ ఆఫీసర్ విచారిస్తే బాగుంటుంది’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే గతంలో ఆదేశాలు ఇచ్చిన సివిల్ జడ్జిపై తన ఆదేశాల ప్రభావం ఏమీ ఉండదని స్పష్టం చేసింది.
శివలింగం కనిపించినట్లు చెప్తున్న ప్రాంతాన్ని పరిరక్షిస్తూనే, ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి ఆటంకం లేకుండా చూడాలని మే 17న ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలు కొనసాగుతాయని చెప్పింది. వివిధ వర్గాల మధ్య సౌభ్రాతృత్వం, శాంతియుత పరిస్థితులు ప్రస్తుతం చాలా అవసరమని వివరించింది.
క్షేత్ర స్థాయిలో సంతులనం, ప్రశాంతత అవసరమని తెలిపింది. తాత్కాలిక ఆదేశాలతో మనకు కొంత సాంత్వన భావం కలగాలని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. దేశంలో సంతులన భావాన్ని కాపాడే ఉమ్మడి కార్యక్రమంలో మనం భాగస్వాములమని తెలిపారు.  ముస్లింలు మసీదులో కాళ్ళు, చేతులు కడుక్కోవడం కోసం ఏర్పాటు చేయాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.  ఈ కేసులో తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.