జ్ఞానవాపి మసీదులో హిందూ దేవుళ్ల బొమ్మలు!

వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో హిందూ దేవుళ్ల ఆనవాళ్లు ఉన్నాయని సర్వే​లో తేలినట్లు స్పష్టం అవుతున్నది.  వారణాసిలోని శృంగార్ గౌరీ కాంప్లెక్స్​లో ఉన్న మసీదులో శివలింగం బయటపడటంతో ప్రత్యేక కమిషన్‌ ఆధ్వర్యంలో వీడియో సర్వేకు కోర్టు ఆదేశించింది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో వీడియో సర్వే చేపట్టిన కమిషన్ గురువారం వారణాసి కోర్టుకు నివేదికను అందజేసింది.
 
వీడియోగ్రఫీ సర్వే నిర్వహించిన అధికారులు ఆ నివేదికను సీల్‌ చేసిన మూడు బాక్సుల్లో గురువారం వారాణసీ కోర్టుకు సమర్పించారు. వందలాది వీడియోక్లి్‌పలు, ఫొటోల చిప్‌ను కూడా కోర్టుకు అందించారు. ఇరుపక్షాలూ తమ అభ్యంతరాలను కోర్టుకు సమర్పించాయి. 
 
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో నిర్వహించిన వీడియోగ్రఫీ సర్వేలో పుష్పాలు, కలశం నగిషీలు, పురాతన హిందీ అక్షరాలను స్తంభాలపై చెక్కిన ఆనవాళ్లు గుర్తించినట్టు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు.  మసీదు బేస్‌మెంట్‌లోని పిల్లర్లపై పుష్పాలు, కలశం నగిషీలు ఉన్నాయని, అక్కడే ఒక పిల్లర్‌పై పురాతన హిందీ అక్షరాలు చెక్కి ఉన్నాయని, బేస్‌మెంట్‌లోని ఓ గోడపై త్రిశూలం చిహ్నం ఉందని తెలిపారు. 
 
మసీదు వెనుక గోడ నుంచి రెండు పెద్ద పిల్లర్లు, ఒక ఆర్చి పొడుచుకువచ్చినట్టు ఉన్నాయని, అవి ఆలయ అవశేషాలేనని పేర్కొన్నారు. మసీదు మధ్య గుమ్మటం కింద శంఖాకార నిర్మాణం ఉందని పేర్కొన్నారు.  ఓ పిల్లర్​పై ప్రాచీన హిందీ భాషలో రాతలు ఉన్నాయి. బేస్ మెంట్ గోడపై త్రిశూలం బొమ్మ కూడా ఉంది. మసీదు మధ్య గుమ్మటం కింద కమలం గుర్తు చెక్కిన ఓ శిల ఉంది.
 
మసీదు వద్ద ఉన్న కోనేరులో 2.5 అడుగుల శివలింగం ఉందని పిటిషనర్లు చెప్పగా, అది ఫౌంటైన్ అని మసీదు కమిటీ వాదించింది. మరోవైపు మసీదులో వీడియోగ్రఫీ సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీలు విచారణను శుక్రవారం జరుపుతామన్న సుప్రీంకోర్టు, అప్పటి వరకు దిగువ కోర్టులో విచారణ కొనసాగించవద్దని ఆదేశించింది.