బలవంతపు మతమార్పిడులను అరికట్టడం కోసం మతస్వేచ్ఛ బిల్లును ఆర్డినెన్సు రూపంలో కర్ణాటక ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన 24 గంటల లోగానే కర్ణాటకలోని కొడగు జిల్లాలో బలవంతపు మత మార్పిడికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఓ పాస్టర్, ఆయన భార్య అరెస్టయ్యారు.
వీరు కేరళలోని వయనాద్‌కు చెందినవారు. వీరు కాఫీ ఎస్టేట్స్‌లోని కూలీల మతాన్ని బలవంతంగా మార్చుతున్నారని కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. కొడగు జిల్లాలోని మంచల్లి గ్రామంలో పాస్టర్ కుర్యిచన్ (62), ఆయన భార్య సలేనమ్మ (57) అక్రమంగా మత మార్పిడులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఓ హిందూ సంస్థ సభ్యులు ఫిర్యాదు చేశారు.
కాఫీ ఎస్టేట్స్‌లోని కూలీలను ప్రలోభాలకు గురి చేసి, వారి మతం మార్చుతున్నారని తెలిపారు. పాస్టర్ ఇంటికి ఈ సంస్థ సభ్యులు వెళ్ళి, ఆయనను ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఎందరిని మతం మార్చారు? ఎంత సొమ్ము వసూలు చేశారు? మీ బ్యాంకు ఖాతాలు ఏవి? అని ఆ దంపతులను ప్రశ్నిస్తున్నట్లు కనిపించింది.
కుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాస్టర్ దంపతులపై భారత శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ 295(ఏ) ప్రకారం బుధవారం కేసు నమోదు చేశారు. ఓ మతాన్ని అవమానిస్తూ, ఆ మతస్థుల మతపరమైన నమ్మకాలను అవమానిస్తూ, వారి మనోభావాలను భంగపరిచేవిధంగా ఉద్దేశపూర్వకంగా, విషపూరితంగా వ్యవహరించినట్లు ఆరోపణలు నమోదు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మత స్వేచ్ఛ హక్కు ఆర్డినెన్స్‌కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ అయితే, దాని ప్రకారం కేసును నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
More Stories
జమిలీ ఎన్నికలపై 31న జేపీసీ రెండో సమావేశం
బిజెపి ఎంపీలపై క్రిమినల్ కేసు కొట్టివేత
8 రోజుల్లో 9 కోట్ల మంది పుణ్యస్నానాలు