అస్సాంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న వర్షాలు 

ఈశాన్య రాష్ట్రం అసోంను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు  అస్సాంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. శనివారం మొదలైన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. కొండ చరియలు విరిగిపడి వరద నీరు పోటెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

27 జిల్లాల్లో సుమారు 1,089 గ్రామలు నీటమునిగాయి. సుమారు 6 లక్షల మంది  వరదల ప్రభావానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వాన బీభత్సంతో పాటు కొండచరియలు విరిగిపడుతుండటంతో రైల్వే ట్రాక్‌లు, వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. దిమా హసావో జిల్లాలో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.

వరదల ప్రభావంతో ఇప్పటి వరకు 9 మంది మృత్యువాతపడ్డారు. కాచర్‌లో ఇద్దరు, ఉదల్‌గురిలో ఒకరు మరణించగా.. కొండ చరియలు విరిగిపడి దిమా హసావోలో నలుగురు, లఖింపూర్‌లో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. మరో అయిదుగురు కనిపించకుండా పోయారు. ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, పోలీసులు రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి.

అసోంలోని పరిస్థితులపై కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో మాట్లాడారు. కేంద్రం తరఫున అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.వరద బాధిత జిల్లాలకు అస్సాం ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసిందని  శర్మ తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల సరఫరాను కొనసాగించేందుకు, కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

వరదనీరు పోటేత్తడంతో దిమా హసావ్ ప్రాంతంలోని హాఫ్లాంగ్ రైల్వే స్టేషన్‌ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. స్టేషన్‌లోని రెండు రైళ్లు పూర్తిగా నీళ్లలో మునిగిపోయాయి. గౌహతి-సిల్చార్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన కొన్ని బోగీలు తిరగబడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముందే ప్రమాద తీవ్రతను అంచనా వేసిన అధికారులు  ప్రయాణికులను సురక్షితంగా తరలించడంతో ప్రాణ నష్టం తప్పింది.

రైల్వే అధికారులు 29 రైళ్లను నిలిపివేశారు. ప్యాసింజర్ రైళ్లలోని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రైల్వే లింక్ పునరుద్ధరించడానికి దాదాపు 45 రోజులు పడుతుందని, రెండు-మూడు రోజుల్లో రోడ్డు కనెక్టివిటీని పునరుద్దరిస్తామని  సీఎం తెలిపారు.

జంతువుల కోసం 40 ఎత్తైన ప్రాంతాల్లో పలు సంరక్షణా శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ తెలిపింది. అసోంలో ప్రముఖ కజిరంగా జాతీయ పార్క్‌ మరియు టైగర్‌ రిజర్వ్‌ కేంద్రం (కెఎన్‌పిటిఆర్‌) అంతర్జాతీయంగా ప్రాముఖ్యత పొందింది. ఈ కేంద్రంతో పాటు ఇతర జాతీయ పార్కుల్లోని జంతువుల రక్షణ కోసం ప్రత్యేక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పరిమల్‌ సుకల్‌బైద్య తెలిపారు.

రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గౌహతి ఆధారిత ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, రానున్న రెండు రోజుల పాటు వర్షాలు మరింత కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇలా ఉండగా, కేరళలో భారీ వర్షాలు పడుతున్నాయి. కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసరగోడ్, పాలక్కడ్, మలప్పురం, త్రిశూర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. రానున్న 5 రోజులపాటు కేరళలో భారీ వర్షాలు పడే అవకాశముందంది వాతావరణ శాఖ. కన్నూర్, కాసరగోడ్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

భారీ వర్షానికి కర్ణాటక రాజధాని బెంగళూరు వణికిపోయింది. బెంగళూరులో కాల్వలు నిండిపోయాయి. రోడ్లపై నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో వాహన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గంలో 4 అడుగుల మేర నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఏపీలోని కృష్ణా జిల్లా ప్రజలు వారం రోజులుగా తీవ్ర ఎండలకు అల్లల్లాడిపోతున్నారు. ఇవాళ ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారింది. గుడివాడలో ఉదయం నుంచి తేలికపాటి వర్షం పడుతుంది. నైరుతి ఇంకా పలకరించకమునుపే వరుణుడు అనంతపూర్, సత్యసాయి జిల్లాలను తడిపేస్తున్నాడు.

జూన్‌ మొదటి వారంలో రుతుపవనాలు తాకనున్న నేపథ్యంలో ముందస్తుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 28 మండలాల పరిధిలో వర్షం కురిసింది. ఒకేరోజు 27.3 మిల్లీమీటర్ల (మి.మీ) సగటు వర్షపాతం నమోదు కావడం విశేషం. ఆత్మకూరు మండలంలో భారీ వర్షం (113.2 మి.మీ) కురిసింది.