రబీ ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం

రబీ ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగినట్లు స్వయంగా అధికార పార్టీ  ఎంపీ, మాజీ మంత్రి  పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు.  ఈ వ్యవహారంపై సిఐడి దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ దృష్టికి ఈ కుంభకోణంను తీసుకు వెడతానని స్పష్టం చేశారు.

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 17 వేల మంది రైతులు ఆధార్‌తో  లింక్ కాలేదని ఎంపీ ఆరోపించారు. రైస్ మిల్లుల యజమానులు, అధికారులు ఆధార్ లింక్ చేయకుండా తెలివిగా రైతులను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రాజమహేంద్రవరంలో బుధవారం జరిగిన తూర్పుగోదావరి జిల్లా తొలి డీఆర్‌సీ, నీటి సలహా కమిటీ సమావేశంలోనే  ఆయన ఈ కుంభకోణం గురించి ప్రస్తావించారు.  ‘‘రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు రైసు మిల్లర్లు దోచేస్తున్నారు. దీని వెనుక రైసుమిల్లర్లు, అధికారులు ఉంటారు. కానీ ఎక్కడా దొరకరు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముందుగా  రైతుల వద్ద  దళారులతో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయిస్తారు. అనంతరం మిల్లరు ఓ జాబితా తెచ్చి అధికారులకు ఇచ్చి అవే పేర్లతో ఆధార్‌కార్డు, బ్యాంక్‌ ఖాతాలు జత చేయిస్తున్నారు. ఒక రైతుకు నాలుగు ఎకరాలు ఉంటే 2 ఎకరాల రైతు పేర చూపి మిగతా రెండు ఎకరాలు వేరే మండలాల్లోని వ్యక్తుల పేర్లతో నమోదుచేసి కనీసం ఒక్కో బస్తాకు రూ.200 దోచేస్తున్నారు అంటూ కుంభకోణం జరుగుతున్న తీరును ఆయన వివరించారు.

దీనిపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ,  కోనసీమ జిల్లాకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. కాకినాడ జిల్లాలో అదీ విధంగా జరుగుతున్నదని, ఆ వివరాలు కూడా సేకరిస్తున్నామని తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలో ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా అని ఆయన తొలుత ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయాధికారి మధుసూదన్‌ మాట్లాడుతూ, ఈ పంట ద్వారా నమోదైన రైతుల పేర్లతో ఆర్బీకేలలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, జిల్లాలో 17 వేల మంది వివరాలు దొరకడం లేదని పేర్కొన్నారు. దీంతో ఎంపీ బోసు జోక్యం చేసుకుని… మరి అవి ఏమైనట్టు? అని ప్రశ్నించారు.

‘‘ఇవన్నీ మిల్లర్లు తప్పుడు పేర్లతో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి ఓ జాబితా అధికారులకు ఇస్తారు. అదే నమోదు చేస్తారు. ఈ కుంభకోణం బయటపడాలంటే ప్రతి గ్రామంలో ఎవరు ఎంత ధాన్యం అమ్మారనేది చాటింపు వేసి ఆరా తీస్తే అసలు సంగతి తేలుతుంది’’ అని ఎంపీ ఆరోపించారు.

జాయింట్ కలెక్టర్ సీహెచ్‌ శ్రీధర్‌ జోక్యం చేసుకుని తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని, రైతులందరికీ ఆర్బీకేల ద్వారా ఎలా అమ్ముకోవాలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కాగా, బోసు వాదనను టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు కూడా సమర్థించారు.