బీజేపీలో పంజాబ్‌ మాజీ పీసీసీ చీఫ్‌ సునీల్ జాఖర్‌

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  మాజీ అధ్యక్షుడు సునీల్ జక్కర్  గురువారం బీజేపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీని విమర్శించినందుకు ఆయనకు ఆ పార్టీ ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసింది. అనంతరం ఆయన e పార్టీకి రాజీనామా సమర్పించారు.

బీజేపీలో చేరిన అనంతరం సునీల్ జక్కర్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కోటరీ ఇప్పుడు ఓ ముఠాగా మారిందని సునీల్ జక్కర్ ఆరోపించారు. నడ్డాతో కలిసి వేదికపై మాట్లాడుతూ, ‘‘మీరు సునీల్ జక్కర్‌ను పార్టీ పదవి నుంచి తొలగించగలరు, కానీ ఆయన గళాన్ని నొక్కేయలేరు’’ అని స్పష్టం చేశారు.

ప్రజలను కులాలవారీగా కాంగ్రెస్ విభజిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను ఓ కుటుంబంగా అభివర్ణిస్తూ, ఆ కుటుంబంతో తెగదెంపులు చేసుకోవడం విచారకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో తనకు 50 ఏళ్ల అనుబంధం ఉందని చెబుతూ తన కుటుంబంలోని మూడు తరాలకు  1972 నుంచి ఆ పార్టీతో అనుబంధం ఉందని చెప్పారు.

పార్టీని తాను ఓ కుటుంబంగా భావించానని తెలిపారు. తాను పార్టీని వీడటానికి కారణం వ్యక్తిగత వివాదాలు కాదని, పార్టీతో ఉన్న మౌలిక సమస్యలే కారణమని చెప్పారు. కాంగ్రెస్‌లో కులతత్వం ఉందని, బీజేపీ అందరినీ సమానంగా చూస్తుందని తెలిపారు.

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సునీల్ జక్కర్ ఆ పార్టీలో చేరారు. నడ్డా మాట్లాడుతూ, జక్కర్ పంజాబ్‌లో బీజేపీ కోసం ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పారు. పంజాబ్‌ను బలోపేతం చేయడం కోసం జాతీయవాద శక్తులన్నీ కలిసి రావడం చాలా ముఖ్యమని తెలిపారు.

ఇదిలావుండగా, సునీల్ జక్కర్‌ను రాజ్యసభ సభ్యునిగా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌  కాంగ్రెస్‌లో అసమ్మతి నేతలను బీజేపీ వైపు ఆకర్షించేందుకు ఆయన ద్వారా ప్రయత్నించబోతోందని సమాచారం. ఆయనకు ఇతర పార్టీల్లో కూడా అభిమానులు ఉన్నారు.

చాలా మంది కాంగ్రెస్ అసమ్మతి నేతలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి సానుకూల అంశంగా కనిపిస్తోంది.  రానున్న హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలకు కెప్టెన్ బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉంది.

అంతుకు ముందు జాకర్‌.. ‘‘నా గుండె బద్దలైంది. అందుకే పార్టీలో 50 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నాను. కాంగ్రెస్‌కు నేను చెప్పే ఆఖరి మాటలివే. గుడ్‌ లక్‌. అండ్‌ గుడ్‌బై కాంగ్రెస్‌’’ అని శనివారం ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రకటించారు. చింతన్‌ శిబిర్‌కు బదులు కాంగ్రెస్‌ ‘చింతా’ శిబిర్‌ నిర్వహించాలన్నారు.

కొందరు ఢిల్లీలో కూర్చొని పంజాబ్‌ను నాశనం చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అంబికా సోనిపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా.. బుధవారం గుజరాత్‌ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ హార్ధిక్‌ పటేల్‌ కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన కూడా పార్టీ నేతల తీరుపై తీవ్ర వ్యాఖ‍్యలు చేశారు.