రైల్వే ట్రాక్‌లు పేల్చేందుకు పాక్ ఐఎస్‌ఐ కుట్ర

దేశ వ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు పాకిస్థాన్ ఐఎస్‌ఐ పథకం రచించినట్టు నిఘా సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. పంజాబ్ సహా దాని పొరుగు రాష్ట్రాల్లో సరకు రవాణా రైళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లను జరపాలని కుట్ర పన్నినట్టు వెల్లడించాయి.
 
 ఈమేరకు ఐఎస్‌ఐ తమ మద్దతుదారులకు నిధులు కూడా పంపుతున్నట్టు, ఇలాంటి ఉగ్ర కార్యకలాపాల కోసం భారత్ లోని పాక్ స్లీపర్ సెల్స్‌కు భారీ మొత్తంలో నగదు ఆఫర్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఖలిస్తాన్‌ ఉగ్రవాదులను కూడా దాడులకు ఐఎస్‌ఐ ఉసిగొల్పుతోందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. లాహోర్‌లో దాక్కున్న ఖలిస్తాన్‌ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండాను ఇందుకోసం వాడుకుంటోందని వెల్లడైంది.
పంజాబ్‌లో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు భారత వ్యతిరేక శక్తులు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నట్టు నిఘా సంస్థలు సేకరించిన ఆధారాలు రుజువు చేస్తున్నాయి.  ఇటీవల దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను హర్యానా పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. 
 
ఓ ఇన్నోవా వాహనంలో భారీ ఎత్తున పేలుడు పదార్ధాలను పలు రాష్ట్రాలకు తరలిస్తోన్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి మూడు ఆర్‌డీఎక్స్ కంటైనర్లు, ఒక తుపాకీ, 31 రౌండ్ల లైవ్ క్యాటరిడ్జ్‌లతోపాటు రూ. 1.30 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాక్ నుంచి డ్రోన్ ద్వారా ఈ ఆయుధాలు వచ్చినట్టు నిందితులు విచారణలో చెప్పినట్టు సమాచారం.
నిఘా వర్గాల సమాచారంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. రైల్వే ట్రాకుల వెంట భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు గస్తీని ముమ్మరం చేశాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని రైలు మార్గాల్లో నిఘా పెంచారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆటలు సాగకపోవడంతో పంజాబ్‌పై గురిపెట్టారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.
జమ్మూకశ్మీర్‌లో ఐఎస్‌ఐ విజయం సాధించలేకపోవడంతో సరిహద్దు రాష్ట్రంలో మిలిటెన్సీని పునరుద్ధరించడానికి పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకుందని భావిస్తున్నారు.  `ఇందుకోసం సిక్కు తీవ్రవాద సంస్థలైన సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) బబ్బర్ ఖల్సా కూడా పనిచేస్తున్నాయి. కుట్రలో భాగంగా పంజాబ్‌లోని యువతను పెడదోవ పట్టించి సాయుధ దాడులు చేసేలా ఉసిగొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయ’ని వివరించారు.  ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు తమ నెట్‌వర్క్‌ను ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోందని పేర్కొన్నారు.