ఆధ్యాత్మిక కేంద్రాలు స్టార్టప్‌లకు స్ఫూర్తినివ్వాలి

దేశం లోని స్టార్టప్‌లు, మేక్ ఇన్ ఇంచియా కార్యక్రమాలకు ఇక్కడి ఆధ్యాత్మిక నిలయాలు స్ఫూర్తిదాయక కేంద్రాలుగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోదీ  పిలుపునిచ్చారు. మైసూరు అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 80 వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఆదివారం ప్రధాని ఆన్‌లైన్ వేదికగా తన సందేశం అందజేశారు. 

అందరి కోసం పాటుపడాలంటై మన సాధువులు ఎల్లప్పుడూ ప్రజల్లో స్ఫూర్తి నింపారని ప్రధాని కొనియాడారు. గణపతి సచ్చిదానందస్వామి జీవితం సైతం సమాజ సేవ, దానధర్మాలతో నిండి ఉందని, అనేక ఆశ్రమాలు, పెద్ద సంస్థ, వివిధ ప్రాజెక్టుల రూపంలో ఇది కనిపిస్తుందని ప్రశంసించారు. 

పవిత్ర గ్రంథాలను ఉటంకిస్తూ, మానవాళి సంక్షేమం కోసం సాధువులు ఉద్భవించారని, వారి జీవితం సామాజిక అభ్యున్నతి మరియు మానవ సంక్షేమంతో ముడిపడి ఉందనడానికి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జీవితమే సజీవ ఉదాహరణ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. దత్త పీఠంలో ఆధ్యాత్మికతతో పాటు ఆధునికత కూడా పెంపొందుతుందని ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు.

3డి మ్యాపింగ్‌తో కూడిన భారీ హనుమాన్ ఆలయాన్ని, ఆధునిక నిర్వహణతో కూడిన లైట్ అండ్ సౌండ్ షో మరియు బర్డ్ పార్క్‌ను ఆయన ఉదహరించారు. దత్త పీఠం వేదాల గొప్ప అధ్యయన కేంద్రంగా కాకుండా, ఆరోగ్య ప్రయోజనాల కోసం సంగీతాన్ని ఉపయోగించడం కోసం ప్రభావవంతమైన ఆవిష్కరణలను చేపడుతోందని ప్రధాన మంత్రి కొనియాడారు.

“ప్రకృతి కోసం సైన్స్  ఉపయోగం, ఆధ్యాత్మికతతో సాంకేతికత  సమ్మేళనం డైనమిక్ భారతదేశానికి ఆత్మ. స్వామీజీ వంటి సాధువుల కృషితో నేడు దేశంలోని యువత తమ సంప్రదాయాల శక్తిని తెలుసుకుని ముందుకు తీసుకెళ్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.” అని మోదీ తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచం మన స్టార్టప్‌లను భవిష్యత్తుగా చూస్తోందని గుర్తు చేశారు. మేక్ ఇన్ ఇండియా, ప్రపంచ అభివృద్ధికి ఆశాకిరణంగా మారుతోంది. ఈ క్రమం లోనే మన ఆధ్యాత్మిక కేంద్రాలు  స్టార్టప్‌లకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నారని ప్రధాని తెలిపారు.

దేశాభివృద్ధి కోసం సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ , సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ అనే మంత్రంతో సమష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు. దేశ అమృతోత్సవాల సందర్భంలో స్వామి 80వ జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నాం. స్వార్ధానికి తావు లేకుండా ప్రజాసేవకు అంకితం కావాలని మన ఆధ్యాత్మిక వేత్తలు మనలో ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తారు అని ప్రధాని పేర్కొన్నారు.

మరో నెల రోజుల్లో రానున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ యోగా, యువత… ఈ రెండు నేడు భారత్‌కు గుర్తింపుగా మారాయని చెప్పారు.

ప్రకృతి సంరక్షణ, పక్షుల సేవలో వారు చేస్తున్న కృషిని గుర్తించిన ప్రధాన మంత్రి, దత్త పీఠం నీరు, నదుల సంరక్షణ కోసం కృషి చేయాలని అభ్యర్థించారు. ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్ల ప్రచారంలో తమ సహకారం అందించాలని ఆయన కోరారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో వారి సహకారాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.