భారీగా తగ్గిన పెట్రో, డీజిల్ ధరలు.. మోదీ ట్వీట్

గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ  కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. లీటర్ పెట్రోల్‌‌పై రూ.8, డీజిల్‌‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఈ మేరకు మంత్రి నిర్మలా సీతారామన్ వరుస ట్వీట్లు చేశారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజల ప్రయోజనాలే తమకు తొలి ప్రాధాన్యమని ట్వీట్ చేశారు. తీసుకున్న నిర్ణయంతో పలు రంగాలకు సానుకూల ప్రభావం లభించనుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

దేశ ప్రజలకు ఊరట లభించనుందని, వారి జీవితాలను మరింత సులభతరం చేసే విధంగా ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.ఎల్లప్పుడూ ప్రజలే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొంటూ ప్రధాని  ట్వీట్‌ చేశారు. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌కుపెట్రో ధరల తగ్గింపు మరింత ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ట్వీట్ ను ఆయన జత చేశారు.

సామాన్యులకు మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని మంత్రి నిర్మలా సూచించారు. ప్రధానితో అన్ని విషయాలు చర్చించిన తర్వాత, పలు రకాల అధ్యయనాల సూచనల మేరకు ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నదని ఆమె చెప్పారు. ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.8 శాతానికి చేరడం, 2014 మేలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టోకు ద్రవ్యోల్బణం ఎన్నడూ లేనివిధంగా 15.1 శాతానికి చేరుకుంది. దానితో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.

సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్ పై రూ. 9.50, డీజిల్ పై రూ. 7 తగ్గనుంది. దేశ రాజధానిలో ఆదివారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ. 95.91గా ఉండనుంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 105.41గా ఉంది. డీజిల్ ధర రూ. 89.67 కానుంది. ఇప్పుడు లీటర్ డీజిల్ ధర రూ. 96.67గా ఉంది.

కాగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు కూడా కేంద్రం ఊరటనిచ్చింది. ఒక్కో సిలిండర్ పై రూ.200 మేర సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 12 సిలిండర్లకు ఈ  సబ్సిడీ వర్తిస్తుందని  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.  సిలిండర్ ధర తగ్గింపుతో కేంద్రానికి దాదాపు రూ.6,100 కోట్ల మేర ఆదాయం తగ్గుతుందని చెప్పారు. పేదలకు ఆర్థిక భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.