అలవాటుగా తప్పులు చేసే నాయకుడు రాహుల్ … బిజెపి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అలవాటుగా తప్పులు చేసే నాయకుడని బీజేపీ దుయ్యబట్టింది. ఆయన శుక్రవారం లండన్‌లో జరిగిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో చేసిన పొరపాటుకు మించిన పొరపాటు చేసే లక్షణం ఆయనకు ఉందని ఆరోపించింది. 

ఆయన ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా భారత దేశాన్ని నకారాత్మక కోణంలో చిత్రిస్తారని పేర్కొంది.  రాహుల్ గాంధీ శుక్రవారం లండన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో మాట్లాడుతూ, బీజేపీ దేశమంతటా కిరోసిన్ ఆయిల్  జల్లిందని ఆరోపించారు. దీనికి ఓ నిప్పు రవ్వ చాలునని చెప్పారు.

జైశంకర్ ఆగ్రహం  

ఐరోపా దేశాల ఉన్నతాధికారులు తనతో మాట్లాడారని,  ఇండియన్ ఫారిన్ సర్వీస్ పూర్తిగా మారిపోయిందని వారు తనకు చెప్పారని రాహుల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘వారు (ఇండియన్ ఫారిన్ సర్వీస్) దురహంకారులు, వారు దేనినీ వినరు. ఇప్పుడు వారు కేవలం తమకు వస్తున్న ఆదేశాలను మాత్రమే చెప్తున్నారు’’ అని తనకు చెప్పారని తెలిపారు. 
 
ఈ వాఖ్యలపై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశ విదేశాంగ విధానం ఆత్మవిశ్వాసంతో కూడినదని, జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు ఉపయోగపడేదని స్పష్టం చేశారు. ఔను, వారు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నారుని చెబుతూ దానిని దురంహకారం అన్నారని, వారు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తున్నారని తేల్చి చెప్పారు. 
 
ప్రపంచంలో భారత దేశాన్ని పటిష్ట దేశంగా నిలపడంలో ముందు మన ఐఎఫ్ఎస్ అధికారులు  ఉంటున్నారని విశ్లేషకులు చెప్తున్నారని ఆయన గుర్తు చేశారు. మన దేశ సమస్యలను అంతర్జాతీయ వేదికలపై స్పష్టంగా వివరిస్తున్నారని, ముఖ్యమైన సమస్యల పట్ల గట్టిగా నిలబడుతున్నారని చెప్తున్నారని తెలిపారు. 
 
అదేవిధంగా మాటలకు, చేతలకు పొంతన లేకుండా వ్యవహరించే పాశ్చాత్య దేశాల వైఖరిని వేలెత్తి చూపడంలో ముందంజలో ఉంటున్నారని అంటున్నారని చెప్పారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ఆయన మనస్తత్వం వల్ల భారత దేశ పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో బలపడటానికి దోహదపడుతోందని చెప్తున్నారని వివరించారు. 

రాష్ట్రాల అధికారాలను తగ్గించేందుకు ఈసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)లను కేంద్ర ప్రభుత్వం విపరీతంగా వాడుకుంటోందని పేర్కొన్నారు. ఓ భావజాలం భారత దేశ గళాన్ని అణగదొక్కిందన్నారు. ఇప్పుడు జాతీయ భావజాల పోరాటం జరుగుతోందని చెప్పారు.

భారత దేశంలో మీడియా న్యాయంగా లేదని, ఓ పక్షం వైపు ఉంటూ ఏకపక్షంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. లడఖ్‌లో ప్రస్తుతం ఉక్రెయిన్ తరహా పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. సరిహద్దుల్లో చైనా వృద్ధి చెందుతోందని, ఆ దేశం పేరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కనీసం ఉచ్చరించడం లేదన్నాని విమర్శించారు.

భారత దేశంలోని పరిస్థితులను పాకిస్థాన్, శ్రీలంకలలోని పరిస్థితుల తో పోల్చి రాహుల్  చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం   గురించి మాట్లాడుతూ, ‘‘ఇటువంటిదానిని గమనించండి. ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోంది? లడఖ్‌లో జరుగుతున్నదేమిటి? ’’  అంటూ ప్రశ్నించారు.

రాహుల్ పరిజ్ఞానంపై బిజెపి ఎద్దేవా 

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. పుస్తకాలను ఇష్టపడని, కనీసం నర్సరీలో అయినా  ఉత్తీర్ణుడు కాని వ్యక్తి పీహెచ్‌డీ పరీక్షలకు హాజరుకావాలని కోరుకున్నట్లు రాహుల్ గాంధీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.

ఆయనకు విదేశీ వ్యవహారాల గురించి కనీసం ఓనమాలు అయినా తెలియవని ధ్వజమెత్తారు. అయితే వ్యాఖ్యలు మాత్రం ఆగకుండా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అలవాటుగా నేరాలు చేసే వ్యక్తి అని ఆరోపించారు.

అంతకు ముందు చేసిన తప్పును మించిన మరొక తప్పును చేసే వ్యక్తి అంటూ దయ్యబట్టారు. ఆయన విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ భారత దేశాన్ని నకారాత్మకంగానే చూపిస్తారని పేర్కొన్నారు. బీజేపీ దేశమంతటా కిరోసిన్ ఆయిల్  జల్లిందని, ఓ నిప్పు రవ్వ చాలునని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, 1984 నుంచి కాంగ్రెస్ నేతల్లో ఈ పని చేయనివారు లేరని గుర్తు చేశారు.

ఉక్రెయిన్ పరిస్థితిని లడఖ్ పరిస్థితితో పోల్చి చెప్పడాన్ని బట్టి రాహుల్ గాంధీకి భారత దేశ బలం గురించి కానీ, విదేశీ వ్యవహారాల గురించి కానీ ఏమీ తెలియదని అర్థమవుతోందని రుజువవుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా గాల్వన్ హీరో కల్నల్ సంతోష్ కుమార్ చేసిన ప్రాణ త్యాగాన్ని బిజెపి నేత గుర్తు చేశారు.

భారత్, పాక్ పరిస్థితులు ఒకే విధంగా ఉన్నాయని రాహుల్ చెప్పడంపై గౌరవ్ స్పందిస్తూ ‘‘మీకు పుస్తక పఠనం ఇష్టం లేదని మాకు తెలుసు. కానీ ఉగ్రవాద దేశమైన పాకిస్థాన్‌తో భారత దేశాన్ని పోల్చవద్దని హెచ్చరిస్తున్నాను’’ అని హితవు చెప్పారు.