కృష్ణా నీటి విడుదలకు పటిష్టమైన ప్రోటోకాల్

కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టుల్లో శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల నుండి నీటి విడుదలకు పటిష్టమైన ప్రోటోకాల్ అవసరం అని కృష్ణానదీ యాజమాన్య సంస్థ నియమించిన రిజర్వాయర్స్ మేనేజ్మెంట్ కమిటీ అభిప్రాయపడింది. 

శుక్రవారం జలసౌధలోని కృష్నాబోర్డు కార్యాలయంలో బోర్డు సభ్యులు, కమిటి కన్వీనర్ రవికుమార్ పిళ్లై అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ఎప్పుడు చేయాలి, విద్యుత్ ఉత్పత్తిని ఎప్పుడు ప్రారంభించాలి, కృష్ణానదికి భారీవరదల సమయంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండి సముద్రంలోకి వృధాగా పోతున్న వరదనీటిని వినియోగించుకుంటే ఆ నీటిని రాష్ట్రాల వాటాలో చేర్చాలా వద్దా తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. 

కృష్ణా నదిపై ఉన్న జలాశయాల్లో నిల్వ చేసిన చుక్కనీటిని కూడా వృధాగా సముద్రం పాలు కాకుండా భాగస్వామ్య రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏవిధంగా ఉపయోగించుకోవలన్న దానిపై చర్చించారు.

జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదిలో లభ్యత నీటిని 2130 టిఎంసిలుగా లెక్కతేల్చి ఇందులో మహారాష్ట్రకు 585 టిఎంసీలు, కర్ణాటకకు 734 టిఎంసిలు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయించింది. ఈ మేరకు మూడు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు పోగా, మిగిలిన వదర నీటిని దిగువ రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వేచ్చగా వినియోగించుకోవచ్చని ట్రిబ్యునల్ స్పష్టంగా పేర్కొంది. 

అయితే కృష్ణానదీలజాల రీఅలకేషన్‌కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆవార్డు ఇంకా అమల్లోకి రానందున ఈ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ ప్రకాశం బ్యారేజీ నుంచి వృధాగా సముద్రంలో కలిసే వరద నీటిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని కమిటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు కోరారు.

అంతే కాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులు, అటు ఆంధ్రప్రదేశ్‌లొని ప్రాజెక్టులకు వదర జలాలు ఉపయోగించుకుంటే ఆ నీటిని రాష్ట్రాలకు నీటి కేటాయింపుల కోటాలో చేర్చి లెక్కించరాదని ఏపి అధికారులు సమావేశంలో ప్రతిపాదించారు. 

విభజన చట్టం మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎపి, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినందున, ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల నీటిలో తెలంగాణకు 299 టిఎంసిలు, ఏపికి 511 టీఎంసీల నీటిని 2014 నుంచి తాత్కాలిక ప్రాతిపదికన ఉపయోగింకుంటున్నాయి. 

ఇదే పద్దతిలో సముద్రంలో కలిసే వరద జలాలను కూడా రెండు రాష్ట్రాలు 34శాతం , 66 శాతంగా వినియోగించుకునే వెసులు బాటు కల్పించాలని ఏపి అధికారులు రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటికి ప్రతిపాదించారు.

తెలంగాణ, ఎపిలో తాగునీటి అవసరాలు , సాగు నీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే రెండు రాష్ట్రాలకు ఉపయుక్తమైన రీతిలో జల విద్యుత్ ఉత్పత్తి జరగాలని ఏపి అధికారులు సమావేశంలో ప్రతిపాదించారు. రాష్ట్రాలకు తాగు, సాగు నీటి అవసారలు లేనప్పుడు ఈ ప్రాజెక్టుల నుంచి జల విద్యుత్ ఉత్పతి అవసరాలు పేరుతో విలువైన నీటిని వృధాగా సముద్రం పాలు చేయటాన్ని అడ్డుకోవాలని వాదించారు. 

కాగా,  ఈ  సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కమిటి సభ్యులెవరూ హాజరు కాలేదు. తాము ప్రీమాన్సూన్ తనిఖీ పనుల్లో ఉన్నందున కమిటి సమావేశాకిని హాజరు కాలేమని ,శుక్రవారం నాటి కమిటి సమావేశాన్ని వాయిదా వేసి జూన్ 15 తర్వాత నిర్వహించాలని కోరుతూ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కృష్ణాబోర్డు చైర్మన్‌కు ముందుగానే లేఖ రాశారు.