2021-22లో భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం

మన దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం భారీగా పెరిగిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. 2003-04 ఆర్థిక సంవత్సరంలో 4.3 బిలియన్ డాలర్లు ఎఫ్‌డీఐలు రాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 83.57 బిలియన్ డాలర్లు వచ్చినట్లు తెలిపింది. 
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఎఫ్‌డీఐలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చినవాటి కన్నా 1.60 బిలియన్ డాలర్లు ఎక్కువ అని వివరించింది.   తయారీ రంగంలో ఎఫ్‌డీఐలు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 12.09 బిలియన్ డాలర్లు కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 21.34 బిలియన్ డాలర్లు అని తెలిపింది. అంటే 76 శాతం పెరుగుదల నమోదైందని వివరించింది.
సింగపూర్ నుంచి అత్యధికంగా ఎఫ్‌డీఐలు వచ్చాయని, ఆ తర్వాతి స్థానంలో అమెరికా, మారిషస్ ఉన్నాయని తెలిపింది. మొత్తం ఎఫ్‌డీలలో 27 శాతం సింగపూర్ నుంచి, 18 శాతం అమెరికా నుంచి, 16 శాతం మారిషస్ నుంచి వచ్చినట్లు పేర్కొంది.  కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగానికి దాదాపు 25 శాతం ఎఫ్‌డీఐలు వచ్చాయి.
ఆ తర్వాతి స్థానంలో సేవా రంగం (12 శాతం వాటా), ఆటోమొబైల్ రంగం (12 శాతం వాటా) ఉన్నాయి. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగంలో కర్ణాటకకు 53 శాతం, ఢిల్లీకి 17 శాతం, మహారాష్ట్రకు 17 శాతం చొప్పున వాటాలు దక్కాయి.  గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎఫ్‌డీఐ ఈక్విటీ ఇన్‌ఫ్లోలో అత్యధికంగా, అంటే 38 శాతం వాటా, కర్ణాటకకు దక్కింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (26 శాతం), ఢిల్లీ (14 శాతం) ఉన్నాయి.
ఆదాయ పంపిణీలో అసమానతలు 
అయితే, దేశ ఆదాయ పంపిణీలో అసమానతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. జాతీయ ఆదాయంలో 5 – 7 శాతం మొత్తం కేవలం 1 శాతం మంది ధనికుల చేతుల్లోకి పోతోంది. ఇందుకు పూర్తి విరుద్ధంగా దేశంలో ఉపాధి పొందుతున్న వారిలో 15 శాతం మంది నెలకు రూ.5 వేల కంటే తక్కువ (64 డాలర్లు) ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 
 
ఈ మేరకు ఆదాయ అసమానతలను తెలియజేస్తూ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్)  ‘భారత్‌లో అసమానతల స్థితి’ పేరిట నివేదికను విడుదల చేసింది. సగటున నెలకు రూ.25 వేల సంపాదిస్తున్న వారు దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 శాతం మంది జాబితాలో ఉన్నారని నివేదిక తేల్చిచెప్పింది. 
 
వీరి భాగస్వామ్యం జాతీయాదాయంలో 30 – 35 శాతం వరకు ఉందని వివరించింది. టాప్ 1 శాతం మంది ఆదాయం అమాంతం పెరిగిపోతుండగా, ఇందుకు వ్యతిరేకంగా దిగువ 10 శాతం మంది ఆదాయం అంతకంతకూ క్షీణిస్తోందని స్పష్టం చేసింది. ఆదాయ వ్యత్యాసాల మధ్య అసమానతలను తొలగించాల్సిన అవసరం ఉందని సూచించింది. చర్యలు తీసుకోకుంటే సామాజిక పురోగతి, ఆర్థిక లక్ష్యాలు నెరవేరవని నివేదిక హెచ్చరించింది.
 
కాగా, కుటుంబాల పరిస్థితుల మెరుగుపరచడంలో భారత్ అద్భుతమైన ప్రయత్నాలు చేసింది. కుటుంబాల అవసరాలు, తగిన నీటి సరఫరా,  పారిశుద్ధ్యం విషయాల్లో గణనీయ పురోగతి లభించింది. అయితే జనాల ఆదాయంలో సమానత, పేదరికం నిర్మూలన, ఉపాధి కల్పన కోసం మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది.