ఎన్ఎస్ఈ మోసం కేసులో ఢిల్లీ, ముంబైల్లో సిబిఐ దాడులు 

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)కి సంబంధించిన మోసం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) శనివారం ఉదయం ఢిల్లీ, ముంబై, నోయిడా, గురుగ్రామ్, తదితర ప్రాంతాల్లో 10 చోట్ల సోదాలు నిర్వహించింది. మార్కెట్ ఎక్స్ఛేంజ్‌లలోని కంప్యూటర్ సర్వర్ల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని స్టాక్ బ్రోకర్లకు అక్రమంగా పంపించినట్లు 2018లో  ఎఫ్ఐఆర్ (ప్రథమ సమాచార నివేదిక) దాఖలైన సంగతి తెలిసిందే. 

ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ చిత్ర రామకృష్ణ ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరు. ఆమె ఓ ‘హిమాలయన్ యోగి’తో ఈ-మెయిల్ సంభాషణలు జరిపినట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఓ నివేదికలో వెల్లడించింది. ఎన్ఎస్ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (జిఓఓ) ఆనంద్ సుబ్రహ్మణ్యం ఈ కేసులో మరొక ప్రధాన నిందితుడు.

మార్చి ఆరున చిత్రను అరెస్టు చేయగా, ఆనంద్‌ను ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. వీరిద్దరూ ఎన్ఎస్ఈకి చెందిన ట్రేడింగ్ సిస్టమ్‌లోని వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశాన్ని చట్టవిరుద్ధంగా ఢిల్లీలోని స్టాక్ బ్రోకర్ ఓపీజీ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని యజమాని సంజయ్ గుప్తాలకు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

చిత్ర రామకృష్ణకు బెయిలు ఇచ్చేందుకు ఇటీవల ఢిల్లీలోని ప్రత్యేక  సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఆమె ఎన్ఎస్ఈ వ్యవహారాలను ఓ ప్రైవేటు క్లబ్‌తో సమానంగా నడుపుతున్నట్లు కనిపిస్తోందని జడ్జి సంజీవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. గాయకుడు, రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత బాబ్ డైలాన్ 1964లో విడుదల చేసిన ఓ పాటలోని భాగాన్ని జడ్జి ప్రస్తావించారు.

డబ్బుకు పలుకుబడి ఉంటుందని, అంతేకాకుండా దానికి చాలా గొప్ప పలుకుబడి ఉంటుందని, ప్రజల మీద అత్యంత వికృత ప్రభావం చూపుతుందని ఈ పాట సారాంశమని చెప్పారు. ఆమెపై అభియోగపత్రాన్ని సీబీఐ గత నెలలో దాఖలు చేసింది.