ఎంపీ స్థానిక సంస్థల్లో ఓబిసి కోటాకు `సుప్రీం’ అనుమతి 

మధ్యప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒబిసి రిజర్వేషన్‌ కల్పించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. వెనుకబడిన తరగతుల కమిషన్‌ రెండవ నివేదికలలోని సిఫార్సుల ఆధారంగా రిజర్వేషన్ల ప్రక్రియను ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించింది.

నివేదిక సవరించబడిందని, డీలిమిటేషన్‌ కసరత్తు ఇప్పటికే పూర్తి చేసి నోటిఫై చేయబడిందంటూ గతంలో న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసిన నివేదికను పరిగణనలోకి తీసుకున్నట్లు జస్టిస్‌ ఎ.ఎం ఖన్విల్కర్‌ తెలిపారు. ఒక వారం రోజుల వ్యవధిలో ఎన్నికలను ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.

సుమారు 23,263 స్థానిక సంస్థల పదవులకు ఎన్నికలను నిర్వహించడానికి నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల్లో సరైన అధ్యయనంతో కూడిన సమాచారం లేకుండా ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడాన్ని తిరస్కరించింది.

ఓబీసీల జనాభా, వారి ప్రాతినిధ్యంపై కచ్చితమైన సమాచారం లేకుండా ఈ ఎన్నికలను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వబోమని తెలిపింది. మధ్య ప్రదేశ్‌ ఒబిసి కమిషన్‌ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఒబిసిల జనాభా 48 శాతం ఉంది. 35 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించవచ్చునని ఈ నివేదిక తెలిపింది.

సుప్రీం కోర్ట్ తీర్పును స్వాగతిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఓబిసి కోటాను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని, అది ఇప్పుడు స్పష్టంగా వెల్లడైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మధ్య ప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కమల్‌నాథ్, ఆ పార్టీ నేతలు సామాన్యులకు ఇబ్బందులను సృష్టించేందుకు కుట్ర పన్నారని చౌహాన్ ఆరోపించారు.

ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం లేదని బీజేపీపై ఆరోపణలు చేశారని,  అయితే ఇప్పుడు ఆ పార్టీ బండారం బయటపడిందని విమర్శించారు.  రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలు నిర్వహించవచ్చునని సుప్రీంకోర్టు చెప్పినపుడు కాంగ్రెస్ నేతలు ఏమీ పరవాలేదని చెప్పారని గుర్తు చేశారు. అయితే ఓబీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించరాదని తాము దృఢనిశ్చయంతో పోరాడామని స్పష్టం చేశారు.

పురపాలక సంఘాలవారీగా అధ్యయన నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు మంగళవారం అడిగిందని, దానిని తాము 24 గంటల్లో సమర్పించామని చెబుతూసుప్రీంకోర్టు చారిత్రక తీర్పు చెప్పిందని హర్షం వ్యక్తం చేశారు. కాగా, తాజా తీర్పు రాజకీయంగా గొప్ప విజయంగా బీజేపీ పరిగణిస్తోంది. మహారాష్ట్రలోని శివసే, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఇదే అంశంపై సుప్రీంకోర్టును ఒప్పించడంలో విజయం సాధించలేక పోతోందని చెప్తోంది.