వైసిపి రాజ్యసభ అభ్యర్థుల్లో ఇద్దరు తెలంగాణ వారే!

ఆంధ్ర ప్రదేశ్ నుండి జరుగనున్న రాజ్యసభ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులుగా వైసిపి ప్రకటించిన నలుగురిలో ఇద్దరు తెలంగాణకు చెందినవారే కాగా,  వారిద్దరూ కూడా అధికారికంగా వైసీపీ సభ్యత్వం గలవారు కూడా కాదు.
ప్రస్తుతం వైసిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్న  వి. విజయసాయి రెడ్డిని వరుసగా రెండోసారి పార్టీ అభ్యర్థిగా ఎన్నిక చేయగా, గతంలో టిడిపిలో ఉంది, 2019 లోక్ సభ ఎన్నికలలో నెల్లూరు నుండి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెంది, తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపిలో చేరిన బీదం మస్తాన్ రావును ఎంపిక చేశారు.
కాగా, తెలంగాణకు చెందిన ప్రముఖ బిసి నాయకుడు,  జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను అనూహ్యంగా వైసిపి అభ్యర్థిగా  ప్రకటించారు. ఆయన 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఎల్బీనగర్‌ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇక, తెలంగాణకు చెందిన సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి నిరంజన్‌రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం వరించింది. ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిబిఐ ప్రత్యేక కోర్టులో ఎదుర్కొంటున్న పలు అవినీతి కేసులను వాదిస్తున్నారు. ఆయనకు కూడా రాజకీయ నేపథ్యం లేదు.
మొత్తం మీద ఇద్దరు బిసిలను ఎంపిక చేయడం ద్వారా ఏపీలో టిడిపికి బలమైన వోట్ బ్యాంకుగా ఉన్న బీసీలలో పెద్ద ఎత్తున చీలిక తీసుకు రావడానికి వైసిపి ఎత్తుగడ వేస్తున్నట్లు కనిపిస్తున్నది. రెండేళ్ల క్రితం కూడా రాజ్యసభ అభ్యర్థులలో ఇద్దరు బిసిలు ఉండడం గమనార్హం. పైగా, రాష్ట్ర మంత్రులుగా ఉన్న ఇద్దరినీ మంత్రి పదవులకు రాజీనామా చేయించి రాజ్యసభకు పంపారు.
టిడిపి హయాంలో ఒక్క బిసిని కూడా రాజ్యసభకు పంపక పంపక పోవడంతో బిసి వర్గాలలో మద్దతు కూడదీసుకొనేందుకు వైసిపి విశేషంగా ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది .  ఏపీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులకు ఎన్నిక జరుగుతూ ఉండగా, నాలుగు సీట్లను గెలుచుకొనే సంఖ్యాబలం వైసీపీకి ఉంది.