ఎన్నికల ప్రధాన కమిషనర్‌ గా రాజీవ్‌ కుమార్‌

భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌ గా రాజీవ్‌ కుమార్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం రాజీవ్‌ కుమార్‌ భారత 25వ ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరించనున్నారు. భారత రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ కొత్త చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ గా రాజీవ్‌ కుమార్‌ ను నియమించారు. 

చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సుశీల్‌ చంద్ర పదవి కాలం మే 14తో ముగుస్తుండటంతో కొత్త చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా రాజీవ్‌కుమార్‌ను రాష్ట్రపతి నియమించిన సంగతి తెలిసిందే. ముగ్గురు సభ్యుల పోల్‌ ప్యానెల్‌ లో సుశీల్‌ చంద్ర అనంతరం సీనియర్‌ అయిన రాజీవ్‌ కుమార్‌ ను ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించారు. 

సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం బహుమతిగా ఇచ్చిన అత్యుత్తమ సంస్థల్లో ఒకటైన మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే సంస్థకు నాయకత్వం వహించే బాధ్యతను తనకు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. 

మన పౌరులకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను అందించడానికి, ఓటర్ల జాబితాల స్వచ్ఛతను నిర్ధారించడానికి, అవకతవకలను నిరోధించడానికి, మన ఎన్నికల ప్రామాణికతను పెంచడానికి ఈసీఐ గత డెబ్బై సంవత్సరాలలో చాలా కృషి చేసినదని గుర్తు చేశారు.

“కమీషన్ కాల పరీక్షకు నిలిచిన ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరిస్తుంది.  మారుతున్న సందర్భాలకు డైనమిక్‌గా అభివృద్ధి చెందడానికి ఏవైనా ప్రధాన సంస్కరణలను తీసుకురావడంలో సంప్రదింపులు, ఏకాభిప్రాయాన్ని నిర్మించడంతో పాటు రాజ్యాంగం ప్రకారం బాధ్యత వహించే విషయాలలో  కఠినమైన నిర్ణయాలకు వెనుకాడదు” అని స్పష్టం చేశారు.

మెరుగైన ఎన్నికల నిర్వహణ, కార్యకలాపాల కోసం పారదర్శకత,  ఓటరు సేవలను సులభతరం చేయడం కోసం ప్రక్రియలను సరళీకృతం చేయడానికి సాంకేతికతను ప్రధాన సాధనంగా మారుస్తామని కుమార్ చెప్పారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కూడా రాజీవ్‌కుమార్‌ ప్రధాన ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. 1984 ఐఎఎస్‌ బ్యాచ్ కి  చెందిన రాజీవ్‌ కుమార్‌ బీహర్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో  పలు పదవుల్లో పనిచేశారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లోనూ పని చేశారు.

రాజీవ్‌ కుమార్‌ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ), ఎకనామికల్‌ ఇంటెలిజెన్స్‌ కౌన్సిల్‌, ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ అండ్‌ డెవలప్‌ మెంట్‌ కౌన్సిల్‌ (ఎఫ్‌ఎస్‌డిసి), బ్యాంక్‌ బోర్డ్‌ బ్యూరో (బిబిబి ) బోర్డుల్లో మెంబర్‌ గా ఉన్నారు.