మొదటిసారి థామస్ కప్ భారత్ కైవసం

73 ఏళ్ళ చరిత్రలో థామస్ కప్ తొలిసారిగా భారత్ వశమైంది. ఫైనల్ మూడో మ్యాచ్ లో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియా ఆటగాడు జొనాథన్ క్రిస్టితో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తలపడ్డాడు. తొలి గేమ్ లో శ్రీకాంత్ మంచి ఆటతీరును కనబర్చాడు. 

73 ఏళ్ల థామస్, ఉబెర్ కప్ చరిత్రలో భారత్ ఫైనల్స్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. అంతేకాదు, చైనా, ఇండోనేషియా, జపాన్, డెన్మార్క్, మలేషియా తర్వాత థామస్ కప్ టైటిల్ సాధించిన ఆరో దేశంగానూ భారత్ రికార్డులకెక్కింది. చారిత్రక విజయం తర్వాత భారత శిబిరంలో సంబరాలు హోరెత్తాయి.

73 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ మెగా టోర్నీలో భారత్ 47 ఏండ్ల కిందట సెమీఫైనల్‌‌ చేరడమే అత్యుత్తమంగా చూపిన ప్రతిభ. ఇప్పటిదాకా మనకు ఒక్క పతకం కూడా రాలేదు! ఈసారి పతకం వస్తుందన్న అంచనాలు లేవు.కనీసం కాంస్యం సాధించినా గొప్ప ఘనతే అనుకుంటే.. మన కుర్రాళ్లు ఏకంగా ‘స్వర్ణ చరిత్ర’ సృష్టించారు..! 

దేశ బ్యాడ్మింటన్‌‌ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు..! క్వార్టర్‌‌ ఫైనల్లో నాలుగుసార్లు విజేత, మలేసియాకు ముకుతాడు వేసి,సెమీఫైనల్లో వరల్డ్‌‌ టాప్‌‌ ప్లేయర్లతో కూడిన డెన్మార్క్‌‌కు చెక్‌‌ పెట్టిన కిడాంబి శ్రీకాంత్‌‌ నేతృత్వంలోని టీమిండియా. ఫైనల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 సార్లు విజేతగా నిలిచిన ఇండోనేసియాను మట్టికరిపించింది. 

థామస్‌‌ కప్‌‌ను హస్తగతం చేసుకొని.. మన త్రివర్ణాన్ని రెపరెప లాడించింది. ఇంత గొప్ప ఘనత సాధించిన  భారత్ జట్టులో శ్రీకాంత్‌‌ సహా నలుగురు తెలుగు ఆటగాళ్లు ఉండటం మరింత ప్రత్యేకం.

థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో 21-15 తేడాతో తొలి గేమ్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే రెండో గేమ్ (23-21) లో కూడా అదే ఆట తీరును కనబర్చాడు. వరుస రెండు గేమ్ లలో క్రిస్టీని ఓడించాడు. భారత ఆటగాళ్లు అద్భుత తీరును కనబరచడంతో ప్రత్యర్థి జట్టుపై 3-0 తేడాతో విజయాన్ని నమోదు చేశారు. ఐదు మ్యాచ్ లు ఆడగా మూడింట్లో విజయం సాధించారు. దీంతో థామస్ కప్ భారత్ వశమైంది.

లక్ష్యసేన్ తన మొదటి గేమ్ లో 8-21, 21-17, 21-16తో అంథోనీ గింటింగ్ ను ఓడించాడు. సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి.. అహ్సన్ – కెవిన్ (డబుల్స్ మ్యాచ్) లపై 18-21, 23-21, 21-19తో గెలిచారు. అనంతరం ఇండోనేషియా ఆటగాడు జొనాథన్ క్రిస్టితో జరిగిన మ్యచ్ లో 21-15, 23-21తో కిదాంబి శ్రీకాంత్ గెలుపొందాడు. 

భారత షట్లర్లు లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి/చిరాగ్ షెట్టీ, కిదాంబి శ్రీకాంత్ 3-0తో చారిత్రాత్మక విజయం సాధించడంతో భారత్‌కు రెండో డబుల్స్ మ్యాచ్, మూడో సింగిల్స్ మ్యాచ్ అవసరం లేకుండా పోయింది.

ఇండోనేషియాను చిత్తు చేసిన భారత్ స్వర్ణ పతకం సాధించగా, ఇండోనేషియా రజత పతకంతో సరిపెట్టుకుంది. డెన్మార్క్, జపాన్ కాంస్య పతకం సాధించాయి.  థామస్ కప్‌లో భారత్ అద్భుత విజయం సాధించడంపై కేంద్రం క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. టీమిండియాకు కోటి రూపాయల రివార్డు ప్రకటించారు. 

14 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఇండోనేషియాను ఓడించిన భారత టీంపై ప్రశంసలు కురుస్తున్నాయి. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబడిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మ్యాచ్ గెలిచిన అనంతరం భారత షట్లర్స్ ఆనందం వ్యక్తం చేశారు.

ప్రధాని అభినందనలు 

థామస్ కప్ లో స్వర్ణం సాధించించిన భారత్ టీంను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మొత్తం దేశం ఉప్పొంగిందని ఆయన తెలిపారు. నిష్ణాతులైన బృందానికి అభినందనలు తెలియ చేస్తున్నట్లు, వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. వారు సాధించిన విజయం చాలా మంది క్రీడాకారులను ప్రేరేపిస్తుందని ఆయన కొనియాడారు.