సాయి గణేశ్ మృతికి మంత్రి పువ్వాడే కారణం

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్యకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సాయి గణేశ్ మృతికి కారణమైన వాళ్లని వదిలే ప్రసక్తిలేదని హెచ్చరించారు. ఆదివారం ఖమ్మం జిల్లాలోని సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తన చావుకు మంత్రి పువ్వాడ అజయ్ కారణం అంటూ సాయి గణేశ్ మరణ వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో సాయిగణేశ్‌ నుంచి మరణ వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని పోలీసులను ప్రశ్నించారు.

మంత్రి అజయ్‌ సూచనతోపాటు సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే స్థానిక పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. సాయి గణేష్‌ది ఆత్మహత్య కాదని, టీఆర్ఎస్  హత్యగా అభివర్ణించారు.  అయినా ఇంత వరకు మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సంజయ్  ప్రశ్నించారు.

స్థానిక పోలీసులు మంత్రి పువ్వాడ అజయ్ కి అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యను వ్యాపారంగా మార్చిన పువ్వాడ అజయ్ వ్యాపారమే ధ్యేయంగా అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.  నోరు తెరిస్తే తన కులం గురించి మాట్లాడుతూ  మంత్రి అజయ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కబ్జా దారులు, దోపిడీ దారులు రాష్ట్రాన్ని ఏలుతున్నారన్న సంజయ్ ఈ   దందాల నుంచి వచ్చే ప్రతి రూపాయిలో ప్రగతి భవన్ కు వాటా ఉందని ఆరోపించారు.

సాయి గణేశ్‌ అమ్మమ్మ సావిత్రమ్మ ప్రస్తుతం అద్దె ఇంట్లో నివాసం ఉంటుండగా, ఆ ప్రాంతంలోనే రూ.15 లక్షలతో ఇల్లు కొనుగోలు చేసి, పట్టా కాగితాలను బండి సంజయ్‌ చేతుల మీదుగా అందజేశారు. సాయి చెల్లెలు కావేరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. సాయి గణేశ్‌తో నిశ్చితార్థం జరిగిన విజయతో సంజయ్‌ మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని, విజయకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తే ఊరుకునేదిలేదని, చర్యకు ప్రతి చర్య ఉంటుందని ఈ సందర్భంగా సంజయ్ హెచ్చరించారు. తెలంగాణలో శాంతి భద్రతలు కరువయ్యాయని, ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ తొంభై శాతం తన ఫాం హౌస్‌లో గడిపారని ఆరోపించారు. 

అంతకు ముందు, గణేష్ ఇంట్లో ఆయనకు నివాళులు అర్పించగా, అతని ఆత్మహతకు కారణాలను వివరిస్తూ గణేష్ అమ్మమ్మ సావిత్రమ్మ బోరున విలపించింది. మంత్రి అజయ్ కుమార్, పోలీసుల వేధింపులకు తన మనవడు బలయ్యాడని కంట తడిపెట్టింది. అతనిపై 15 కేసులు పెట్టారని తెలిపింది.  గణేష్ కు బిజెపి అంటే ప్రాణం అని, పార్టీ కోసం నిరంతరం కష్టపడేవాడని ఆమె వివరించింది. మాజీ ఎంపీ గరికపాటి మోహనరావు, మాజీ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడాసంజయ్ తో పాటు కుటుంభం సభ్యులను పరామర్శించారు.