రాహుల్ భట్ హత్యపై సిట్ దర్యాప్తు

రాహుల్ భట్‌ ను ఉగ్రవాదులు కాల్చిచంపడంపై నిరసనలు తెలిపిన కశ్మర్ పండిట్ ఉద్యోగులపై పోలీసు చర్యను లెఫ్టినెంట్ గవర్నర్  మనోజ్ సిన్హా ఆదివారంనాడు ఖండించారు. దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు. 
 
కశ్మీర్ పండిట్లకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందంటూ జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో గత శుక్రవారంనాడు కశ్మీర్ పండిట్ ఉద్యోగులు నిరనసలకు దిగారు. ప్రదర్శకులపై పోలీసులు బుద్గాంలోని షేక్‌పోర లాఠీచార్జి జరపడంతో పాటు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.
 
 భట్ హత్యపై దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం ఇందుకోసం ‘సిట్’ను ఏర్పాటు చేసింది.  “భట్ హత్య టార్గెటెడ్ కిల్లింగ్. భయోత్పాతం సృష్టించేందుకు జరిగిన ప్రయత్నం. ఆయన చాలా మంది ఉద్యోగి. ఈ ఘటనపై దర్యాప్తునకు మేము సిట్ ఏర్పాటు చేశాం. ఎస్‌హెచ్‌ను కూడా అటాచ్ చేశాం. అన్ని కోణాల్లోంచి సిట్ దర్యాప్తు జరుపుతుంది” అని సిన్హా తెలిపారు.
 నిరసనకారులపై పోలీసు ఫోర్స్ ఉపయోగించడంపై కూడా సిట్ దర్యాప్తు జరుపుతోందని, ఉద్యోగులకు వారం రోజుల్లో  సురక్షితమైన ప్రాంతాలకు పోస్టింగ్ ఇస్తామని ఆయన చెప్పారు. వారికి ఉన్న ఇతర సమస్యలపై కూడా దృష్టిసారిస్తామని, ఉద్యోగుల ఆవేదన, కష్టాలను తాము అర్ధం చేసుకోగలమని పేర్కొన్నారు.
ఉద్యోగులు ఎక్కడ నివసిస్తే అక్కడ వారికి పూర్తి భద్రత కల్పిస్తామని మనోజ్ సిన్హా భరోసా ఇచ్చారు. పోలీసు చర్య అవసరం లేదని కూడా ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలిచ్చినట్టు సిన్హా చెప్పారు. కశ్మీర్‌లో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దీనిని తాము చాలా సీరియస్‌గా తీసుకుంటామని సిన్హా చెప్పారు.
శాంతియుత వాతావరణం చెక్కుచెదరకుండా ఉండేందుకు అంతా కలిసికట్టుగా ఉండాలని రాజకీయ పార్టీలు, ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణాన్ని భంగపరిచే వారి ఆటలు సాగనీయమని ఆయన హెచ్చరించారు. రాహుల్ భట్ హత్యతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న ఇద్దరు విదేశీ ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి హత్యా ఘటనలకు పాల్పడుతున్న శక్తులను సామజిక బహిష్కరణ చేయాలని ప్రజలను, పార్టీలకు సిన్హా కోరారు.
ఇలా ఉండగా, బీజేపీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఆదివారం  లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో సమావేశమై తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల భద్రత సమస్యను ప్రస్తావించింది. సమావేశం అనంతరం జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల భద్రతకు భరోసా కల్పించేందుకు నోడల్ సెల్‌ను ఏర్పాటు చేస్తామని ఎల్‌జీ హామీ ఇచ్చారని చెప్పారు.
 
 “కాశ్మీరీ పండిట్‌లను పాకిస్తాన్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న తీరుపై మేము లెఫ్టనెంట్ గవర్నర్ తో చర్చించాము. కాశ్మీర్‌లోని తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న అటువంటి ప్రభుత్వ ఉద్యోగులను తప్పనిసరిగా సురక్షిత జోన్‌లకు బదిలీ చేయాలి. వారి భద్రతకు భరోసా ఇచ్చే నోడల్ సెల్‌ను ఏర్పాటు చేస్తానని ఆయన మాకు చెప్పారు” అని రైనా వెల్లడించారు.

కాగా, రాహుల్ భట్ హత్య తర్వాత క్రికెటర్ సురేశ్ రైనా కూడా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. “నా కాశ్మీరీ హిందూ సోదరి కష్టాలను వినవలసిందిగా ప్రధానమంత్రి @నరేంద్రమోదీ జీని అభ్యర్థిస్తున్నాను. కాశ్మీర్‌లో ఉగ్రవాద బాధితుల కోసం భారతీయులమైన మనం కలిసి నిలబడాలి. వారిని ఒంటరిగా వదిలి పెట్టలేము. ఆయన వారి డిమాండ్లను వింటారని, వారిని సురక్షితమైన ప్రదేశాలకు పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని సురేష్ రైనా  ఓ వీడియోతో పాటు ట్వీట్ చేశారు.