ముఖ్యమంత్రిగా డా. మాణిక్‌ సాహా ప్రమాణ స్వీకారం

త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా డాక్టర్‌ మాణిక్‌ సాహా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. అగర్తలాలోని రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్‌  సత్యదేవ్ నరేన్ ఆర్య   ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టేంతవరకూ సాహా.. త్రిపుర రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు. త్రిపుర క్రికెట్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు.
2016లో బీజేపీలో చేరిన మానిక్ సాహా అంచెలంచెలుగా ఎదిగారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన త్రిపుర మెడికల్‌ కాలేజీలో డెంటల్‌ ఫ్యాకల్టీగా పనిచేశారు. మరో ఆరునెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బిప్లవ్‌ దేవ్‌తో రాజీనామా చేయించిన బీజేపీ అధిష్ఠానం మానిక్‌ సాహాకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యులు.
త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలపై, శాంతిభద్రతల పరిస్థితిని పటిష్టం చేయడంపైనే తన ప్రధాన దృష్టి అని మాణిక్ సాహా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. 

“బిప్లబ్ దేబ్ జీ నేతృత్వంలోని మా ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లింది. మేము ఆ  పనిని కొనసాగించడానికి, ప్రజల కోసం పని చేయడానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధిని తీసుకురావడానికి పని చేస్తాము… అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి. నేను ఈ పనులను ముందుకు తీసుకెళ్తాను. పటిష్టమైన శాంతిభద్రతల పరిస్థితిని నిర్ధారించడానికి నేను పని చేస్తాను, ”అని సాహా వివరించారు.

బిజెపి పార్టీ సంస్థను నడిపిన అనుభవం త్రిపుర ముఖ్యమంత్రిగా కూడా ఆయన సహాయ పడుతుందని భరోసా వ్యక్తం చేశారు.