పౌరులందరికీ సమానంగా జీవించే హక్కు కల్పించాలి

రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్‌ ప్రకారం దేశంలోని పౌరులందరికీ సమానంగా జీవించే హక్కు కల్పించాల్సిన అవసరముందని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. అట్టడుగు వర్గాలకు సమాన హక్కులు, న్యాయం అందే పరిస్థితులు ప్రస్తుతం లేవని ఆయన విచారం వ్యక్తం చేశారు. 
 
వాటిని అందరికీ సమానంగా అందించే దిశగా విద్యావంతులైన మీలాంటి వారు కృషి చేయాల్సిన అవసరముందని విద్యార్థులకు సూచించారు. శనివారం జరిగిన అనంతపురం జెఎన్‌టియు 12వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్‌ హోదాలో ఆయన పాల్గన్నారు. జెఎన్‌టియులోని ఎన్‌టిఆర్‌ ఆడిటోరియం హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసరు జి.రంగజనార్ధన్‌ అధ్యక్షత వహించారు. 
 
ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్నాతకోత్సవం సందర్భంగా ఇక్కడి పూర్వ విద్యార్థి అయిన డిఆర్‌డిఒ చైర్మన్‌ జి.సతీష్‌రెడ్డికి గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్‌ ప్రదానం చేశారు. 2021లో బిటెక్‌, ఫార్మసీ, ఎంబిఎ పూర్తి చేసిన 35,177 మందికి డిగ్రీ పట్టాలను, 81 మందికి పిహెచ్‌డి పట్టాలను అందజేశారు. 
 
ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ మహాత్మాగాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి మహానీయులు బ్రిటీష్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడడం వల్ల దేశానికి స్వాతంత్య్రం లభించిందని పేర్కొన్నారు. వారి పోరాట స్ఫూర్తి, త్యాగాలను గుర్తు పెట్టుకుని దేశ పురోభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 
 
సోమనాథ్‌ మాట్లాడుతూ కొన్ని రంగాల్లో భారతదేశం సాంకేతిక సృష్టికర్తగా ఉందని తెలిపారు. అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశం మరింతగా ముందుకెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయని థెయ్ల్పారు. రొబోటిక్‌ సెన్సార్‌ అంతరిక్ష పరిశోధనలకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు.

జెఎన్‌టియు 12వ స్నాతకోత్సవం అనంతరం హెలికాఫ్టర్‌లో తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి గవర్నర్‌ చేరుకున్నారు. అక్కడ నుంచి కారులో తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు.