చట్ట ప్రకారం మూడు రాజధానులు చేయరు, చేయలేరు

చట్ట ప్రకారం మూడు రాజధానులు చేయరు, చేయలేరని  బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు స్పష్టం చేశారు.  రాజధాని గ్రామాల్లో శనివారం బీజేపీ ఎంపీ జీవీఎల్ పర్యటించిన ఆయన  మూడు రాజధానులు సాధ్యం కాదని జగన్‌కు అర్ధమైపోయిందని, లేదంటే మొన్న అసెంబ్లీలో నిర్ణయం చేసే వారని చెప్పారు. 
 
మందడంలోని టిడ్కో ఇళ్లను జీవీఎల్ పరిశీలించగా మూడేళ్లుగా తిరుగుతున్నా తమకు ఇళ్లు అప్పగించలేదని ఎంపీ జీవీఎల్‌కు లబ్ధిదారులు మొరపెట్టుకున్నారు. ఎస్ఆర్ఎం, విఐటి, ఎన్ఐడి కాలేజీలను జీవీఎల్ పరిశీలించారు. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తాత్కారం చేస్తోందని జీవీఎల్‌ విమర్శించారు. 
 
రాజధాని ప్రాంతంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించానని, మూడేళ్లుగా అమరావతి రాజధాని నిర్మాణం కొత్త మలుపులు తిరుగుతుందని ఆయడి న వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం పనులు చేయకుండా అభివృద్ధిని అటకెక్కించిందని విమర్శించారు. 
 
టీడీపీ ప్రభుత్వం కూడా కొంత అసమర్థత వల్ల సమయానుకులంగా పనులు చేయలేదని చెప్పారు. ఇదే అదనుగా జగన్ రాజధాని నిర్మాణ పనులు నిలిపివేశారని జీవీఎల్ మండిపడ్డారు. ‘ఆదర్శ రాజధాని చేస్తా’ అని చెప్పి అధికారంలోకి వచ్చాక జగన్ నమ్మక ద్రోహం చేశారని దుయ్యబట్టారు. 
 
జగన్ మాటలు నమ్మి ఓట్లు వేస్తే రోడ్డు మీదకు లాగారని బీజేపీ ఎంపీ నిప్పులు చెరిగారు.  మూడు రాజధానులు పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని, నిర్ణయం వెనక్కి తీసుకుని కూడా జగన్ డ్రామాలు ఆడుతున్నారని జీవీఎల్ మండిపడ్డారు. ఇప్పుడు కొత్త ప్రతిపాదనతో మూడు రాజధానులపై ముందుకు వస్తామనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
హైకోర్టు తీర్పును ధిక్కరించే విధంగా జగన్ ప్రభుత్వం తీరు ఉందని, అమరావతిలో మౌలిక వసతులు కల్పించలేదని జీవీఎల్ విమర్శించారు. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పనులు ఆగిపోయాయని, హైకోర్టు తీర్పు ప్రకారం నెల రోజుల్లో పనులు చేయాల్సి ఉందని గుర్తు చేశారు. అయినా కనీసం స్పందించక పోవడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికలలో మీరు అధికారంలో ఉంటారని ప్రజలు భావించడం లేదని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి జీవీఎల్ స్పష్టం చేశారు. కనీసం మౌలిక వసతులు కల్పిస్తే సంస్థలు తమ పని తాము చేసుకుంటూ పోతాయని, కానీ లక్ష కోట్లు కావాలని జగన్ సర్కార్‌ చెప్పడం‌‌ వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. రైతులు ఏ పార్టీతో కలిసి నడవద్దని ఆయన సూచించారు.
మీ వద్ద భూములు తీసుకున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, ఎవరు అధికారంలో ఉన్నా ఈ ఒప్పందాన్ని అమలు చేయాల్సిందేనని జీవీఎల్ స్పష్టం చేశారు. అమరావతి ఏకైక రాజధాని అని బిజెపి మొదటి నుంచీ చెబుతూ ఉందని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టు వీడి మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని వైసీపీ సర్కార్‌కు జీవీఎల్ హితవు పలికారు. లేదంటే కోర్టు ధిక్కరణ కింద జగన్ సర్కారు ఇబ్బందులు పడుతుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు వేయకపోగా ఉన్న రోడ్లు తవ్వేస్తుందని ధ్వజమెత్తారు.
టీడీపీతో చేయాల్సిన రాజకీయాలు‌ చేసుకోండని.. కక్ష పూరితమైన రాజకీయాలకు రైతులను బలి చేయవద్దని జీవీఎల్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి హితవు చెప్పారు.  ఒక ప్రణాళిక ప్రకారం పనులు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని, ఇంకా మోసం చేయాలని చూస్తే బెడిసి కొట్టడం ఖాయమని జీవీఎల్ హెచ్చరించారు.