ధరల అదుపుకై గోధుమ ఎగుమతులపై నిషేధం 

దేశవ్యాప్తంగా ధరలు పెరుగుతుండటం, అధిక ద్రవ్యోల్బణం వంటి కారణాలతో ధరల అదుపు లక్ష్యంగా గోధుమ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని  ఓ ప్రకటనలో తెలిపింది. ముందు రోజు నోటిఫికేషన్‌ లేదా అంతకు ముందు క్రెడిట్ లెటర్స్‌లో జారీ చేసిన షిప్‌మెంట్‌లు మాత్రమే అనుమతించబడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
అయితే,  ఇతర దేశాల నుంచి వచ్చే అభ్యర్థనలపై ఎగుమతులకు ప్రభుత్వం అనుమతిస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ‘‘ దేశం మొత్తం ఆహార భద్రతను నిర్వహించడానికి, పొరుగు, ఇతర బలహీన దేశాల అవసరాలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’’ అని స్పష్టం చేసింది. దేశంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లను నియంత్రించే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.
 

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైప్పటి నుంచి నల్ల సముద్రం మీదుగా ఎగుమతులు నిలిచిపోగా… గోధుమల కోసం ప్రపంచ దేశాలు భారతదేశాన్ని సంప్రదిస్తున్నాయి. ప్రపంచంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు భారత్ కావడం విశేషం.

మార్చిలో అధిక ఉష్ణోగ్రతలు కారణంగా గోధుమ పంట దెబ్బతిని, ఉత్పత్తి భారీగా పడిపోవడంతో ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. దీంతో పాటు ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 7.79 శాతానికి చేరడం తీవ్ర ఒత్తిడికి గురయ్యింది.  గోధుమలు, గోధుమల ఉత్పత్తుల ధరలు మన దేశంలో 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగాయి. అంతర్జాతీయ ధరలు 14 ఏళ్ళ గరిష్ఠానికి చేరుకున్నాయి. యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. 

మన దేశంలో గోధుమల ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా వీటి ధరలు పెరగడంతో పాటు ఇంధన ధరలు కూడా పెరుగుతుండటం ఓ కారణం. ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడం కోసం మొక్కజొన్న, గోధుమలను వాడుతుండటం మరొక కారణం. అంతర్జాతీయ ధరలు పెరుగుతుండటంతో గోధుమలకు డిమాండ్ పెరిగింది. 

గోధుమ ఎగుమతులపై నిషేధం విధించే ఆలోచన లేదని మే ప్రారంభంలో వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ అధికారులు తెలిపారు.  దేశీయ అవసరాలకు సరిపడేన్ని గోధుమలు ఉన్నాయని, ఎగుమతులపై నిషేధం విధించబోమని ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే చెప్పారు. 

ఇటీవల ఐరోపా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీలో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా గోధుమ కొరత ఎదుర్కొంటున్న తరుణంలో ‘భారత రైతులు ప్రపంచానికి ఆహారం అందించేందుకు ముందుకు వచ్చారు’ అని ప్రకటించారు. ‘ప్రపంచం మానవత్వం సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా భారతదేశం ఒక పరిష్కారాన్ని చూపుతుంది’ అని ప్రశంసించారు.

దేశంలో వరుసగా ఐదేళ్లు రికార్డు స్థాయిలో గోధుమ దిగుబడులు సాధించింది. ఈ ఏడాది 111.3 మిలియన్ టన్నుల గోధుమల ఉత్పత్తి అవుతాయని అంచనా వేసినా, మార్చిలో అధిక ఉష్ణోగ్రతలు దిగుబడిని దెబ్బతీశాయి. కేవలం 106 మిలియన్ టన్నులు దిగుబడి వచ్చింది. మరోవైపు, ఉల్లి విత్తనాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేసినట్టు మరో నోటిఫికేషన్‌లో డీసీఎఫ్టీ తెలిపింది.